మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దైవదర్శనానికి కారులో వెళ్లి, మొక్కులు తీర్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం షిఫ్ట్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హలిఖేడ్ టోల్‌గేట్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అప్పటికే ముగ్గురు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ ప్రాంతవాసులు. మృతుల్లో నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) ఉన్నారు. మరొకరు మనూర్ మండలంలోని ఎల్గోయి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
ప్రమాదం విషయం తెలుసుకున్న హలిఖేడ్ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిరాదర్ ప్రతాప్ అనే వ్యక్తిని బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న ఖేడ్ ఎంఎల్‌ఎ సోదరుడు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబాలను పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీదర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బిరాదర్ ప్రతాప్‌ను పరామర్శించారు.