ఛండీగఢ్: ఓట్ చోరీపై హెచ్ ఫైల్స్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణలు చేశారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లలో భారీ అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు అందాయన్నారు. పోలైన పోస్టల్ ఓట్లకు, ఫలితాలకు చాలా తేడా ఉందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనూ భారీగా ఓట్ల చోరీ జరిగిందని దుయ్యబట్టారు. హర్యానాలో ఒక యువతికి 10 బూత్‌లలో 22 ఓట్లు ఉన్నాయని ఫొటోలను రాహుల్ చూపించారు. సీమా, స్వీటీ, సరస్వతి.. ఇలా వివిధ పేర్లతో ఒకే యువతికి అన్ని ఓట్లు ఎలా ఉంటాయని అడిగారు. సదరు యువతిని బ్రెజిల్‌కు చెందిన మోడల్‌గా గుర్తించామని వివరించారు. హర్యానాలో 2 కోట్ల ఓటర్లు ఉన్నారని, 25 లక్షల ఓట్లను దొంగలించారని ఆరోపణలు చేశారు. ఒకే ఫొటోతో ఒకే అసెంబ్లీ స్థానంలో 100 ఓట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఓ మహిళ పేరుతో రెండు పోలింగ్ కేంద్రాల్లో 223 ఓట్లు ఎలా ఉంటాయని నిలదీశారు. హర్యానాలో గెలుస్తామని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని, అయినప్పటికీ ఫలితాలు తారుమరయ్యాయని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హర్యానాలో ఐదు లక్షలకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని ధ్వజమెత్తారు. తప్పుడు చిరునామాలతో 93 వేలకు పైగా ఓట్లు ఉన్నాయని, ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బిజెపికి లబ్ధి కలిగించేందుకు ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. హర్యానాలో ప్రతి ఎనిమిది ఓట్లలో ఒకటి నకిలీ ఓటు ఉందన్నారు. ఎన్నికల సంఘటం తలుచుకుంటే డూప్లికేట్ ఓట్లను సెకన్లలోనే తొలగించొచ్చని పేర్కొంది. ఇసికి బిజెపి సహాయం చేసిందని, ఉత్తర ప్రదేశ్‌లో ఓటు వేసి వారు వేల సంఖ్యలో హర్యానాలో ఓటు వేశారని రాహుల్ దుయ్యబట్టారు. బిజెపి వాళ్లు అయినంత మాత్రాన దేశంలో ఎక్కడైనా ఓటు వేస్తారా? అని ధ్వజమెత్తారు. వేల మందికి యుపి, హర్యానాలో డబుల్ ఓట్లు ఉన్నాయని చురకలంటించారు. ఇళ్లు లేని ఓటర్లకు ఇంటి నంబర్ 0 ఇచ్చామని ఇసి చెప్పిందని, ఇంటి నంబర్ 0 ఉన్న ఓటర్లను కూడా తాము తనిఖీ చేశామన్నారు.