ఆనందం అంబరాన్ని చుంబించిన వేళ! అందనంత దూరంలో ఆకాశాన ఉన్న జాబిల్లి అందినంత సంబరం! ఏళ్ల తరబడి కన్నకలలు ఫలించిన రోజు! మొన్నటి రోజు భారత క్రికెట్ క్రీడాకారిణులు సాధించిన అపూర్వమైన విజయాన్ని వర్ణించడానికి ఇలాంటి ఉపమానాలు ఎన్నయినా చాలవంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, ఐకమత్యం, ఆత్మవిశ్వాసం ఒకచోట చేరితే ఏమవుతుంది? అద్భుతమైన విజయం సొంతమవుతుంది. నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో అదే జరిగింది! ఏడు మ్యాచ్‌లు ఆడి ఒక సెంచరీతో సహా 308 పరుగులు చేసిన ఓపెనర్ ప్రతీకా రావల్ సెమీఫైనల్‌కు ముందే గాయంతో వైదొలిగింది! విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన ఫామ్ అంతంత మాత్రమే. పైగా వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి. అలాంటి పరిస్థితుల్లో భారత్ గెలుస్తుందని ఎవరైనా ఎలా అనుకుంటారు? కానీ, మన అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చరిత్రను తిరగరాశారు. తమదైన రోజున ఎలాంటి అద్భుతాలనైనా చేయగలమని నిరూపించారు.
కనీవినీ ఎరుగని బ్యాటింగ్‌తో భారత్‌ను పైనల్‌కు నడిపించిన జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్, ఫైనల్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన షెఫాలీ, అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ విశ్వరూపం చూపించిన దీప్తిశర్మ భారత్‌ను విజయశిఖరాలవైపు నడిపించిన తీరు అమోఘం. అయితే విజేతల గురించే కాదు, ఈ సందర్భంగా స్ఫూర్తిదాయకమైన ఆటను ప్రద్శరించిన ప్రత్యర్థులను సైతం ప్రస్తావించుకోవడం సముచితం అనిపించుకుంటుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉండవచ్చు గాక, కానీ ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ బాధ్యతాయుతమైన ఆటతీరు, చివరికంటా పోరాడినవైనం చిరస్మరణీయం. ప్రపంచ కప్ సెమీ ఫైనల్లోనూ, ఫైనల్లోనూ సెంచరీలు చేసిన లారా, కెప్టెన్ పదవికి వన్నె తెచ్చిందనడంలో సందేహం లేదు. నిన్నమొన్నటి వరకూ క్రికెట్ కు.. అదీ పురుషుల క్రికెట్‌కు తప్ప భారతదేశంలో మరే ఆటకూ ఆదరణ ఉండేది కాదు. అంతర్జాతీయంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఫుట్ బాల్ క్రీడకు కూడా ఇక్కడ ఆదరణ అంతంత మాత్రమే.
ఇక మహిళల క్రికెట్ గురించి చెప్పాల్సిన పనేముంది? ‘మైదానానికి రండి.. మా ఆట చూడండి.. మమ్మల్ని తిట్టండి.. బాగా ఆడితే ప్రోత్సహించండి’ అంటూ మన మాజీ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు సునీల్ చెత్రీ ఒక సందర్భంలో కన్నీటి పర్యంతమవుతూ అన్న మాటలు మన మహిళా క్రికెట్‌కూ వర్తిస్తాయి. భారత మహిళల క్రికెట్ అసోసియేషన్ ఐదు దశాబ్దాల క్రితమే రూపుదిద్దుకున్నా, దాదాపు 30 ఏళ్లపాటు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండేది. నిధులు లేక నీరసించి, దిశానిర్దేశం చేసే కోచ్‌లు లేక నిస్తేజంగా మారిన మహిళా క్రికెట్‌కు ఊపిరులూదింది నిస్సందేహంగా బిసిసిఐయే. మహిళల క్రికెట్ ఇరవై ఏళ్ల కిందట బిసిసిఐ అధీనంలోకి వచ్చాక, క్రికెట్ తీరే మారిపోయింది. ఆట కొత్త నడకలు నేర్చింది. వేగాన్ని అందిపుచ్చుకుంది. దూకుడే తన చిరునామాగా మార్చుకుంది. ‘మేం కోమలాంగులం కాదు.. కొదమ సింహాలం’ అంటూ మనవాళ్లు సత్తా చూపడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా నిన్నటి తరం క్రీడాకారిణులు మిథాలీరాజ్, జులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా తమదైన ఆట తీరుతో భారత మహిళా క్రికెట్ స్వరూపాన్ని ఆసాంతం మార్చేశారు. వారి క్రమశిక్షణను, ఆటనూ హర్మన్ సేన యథాతథంగా అందిపుచ్చుకుందనడానికి మొన్నటి రోజు చేసిన అద్భుత ప్రదర్శనే నిదర్శనం. మహిళల ప్రీమియర్ లీగ్‌కు బిసిసిఐ శ్రీకారం చుట్టడం కూడా కలిసివచ్చింది. ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తాజా విజయంతో భారత మహిళా క్రికెట్ విశ్వవేదికపై మరిన్ని విజయాలు సాధిస్తుందనడంలో సందే హం లేదు. అంతటి ఆత్మవిశ్వాసాన్ని మన ఆణిముత్యాలు అందిపుచ్చుకున్నారు. అంతకుమించిన క్రమశిక్షణనూ అలవరచుకున్నారు. క్రికెట్ ను ఎంచుకునే క్రీడాకారిణులకు భారత మహిళా జట్టు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. రెండుసార్లు అందినట్టే అంది చేజారిన ట్రోఫీ మూడోసారి చిక్కిన మధుర క్షణాలివి. అంతేకాదు, భారత మహిళల జట్టు అంతర్జాతీయ వేదికలపై ఆడటం మొదలుపెట్టిన 50 ఏళ్ల తరువాత లభించిన విజయం కూడా. అపూర్వమైన ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం. జయహో భారత్!