మొంథా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ మొదలైన జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో పంటల విస్తీర్ణత ఇంకా ఎక్కువగా ఉంటుంది. పంట నష్టంతోపాటు రెండు డిస్కింల పరిధిలో విద్యుత్ సంస్థకు 10 వేల కోట్ల దాకా నష్టం జరిగింది. 4,576 కిలోమీటర్ల మేర రహదార్లు దెబ్బతిన్నాయి. 302 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. రహదారుల మరమ్మతులకు 2,713 కోట్ల అవసరమని ఆర్ అండ్ బి శాఖ మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ వల్ల జరిగిన మొత్తం నష్టం రూ. 5,265 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. నష్టం ఇంకా పెరుగుతుంది.
తెలంగాణలో పంట కాల్వల, మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేకపోవటం, ముళ్లకంపలు, పూడికలతో కాల్వలు నిండి ఉండటం వల్ల వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కాల్వలకు గండ్లు పడి పంటలు ముంపునకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వలే లేవు. తెలంగాణ ప్రభుత్వం ఎకరా పంటకు నష్ట పరిహారంగా 10 వేల రూపాయలు ప్రకటించింది. ఇది రైతుకు ఊరటనివ్వదు. ఎకరా సేద్యానికి రూ. 35 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతు నిలదొక్కుకోవటానికి ఉపయోగపడదు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఎకరాకు రూ. 20 వేల పరిహారం ఇవ్వాలి. కౌలు రైతులకు పరిహారమే లభించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మొదలగు జిల్లాల్లో మొంథా తుఫాన్‌వల్ల లక్షా, 38 వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని, 12,215 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయని, ఆక్వారంగంలోని 32 వేల ఎకరాల్లో రైతాంగం నష్టపోయారని, 2,261 పశువులు చనిపోయాయని, 4,794 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్ల, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని, 311 కల్వర్టుల, వంతెనలకు నష్టం వాటిల్లిందని, విద్యుత్ సంస్థకు అపారంగా నష్టం జరిగిందని, మొత్తం నష్టం 5,244 కోట్ల రూపాయలగా ప్రాథమిక అంచనాను కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపింది.
క్షేత్ర స్థాయి పరిశీలనలో నష్టం చాలా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. అనేక చెరువులు, వాగులకు గండ్లు పడి పంటలతోపాటు వందలాది గ్రామాలు నీటమునిగాయి. అనేక చోట్ల రాకపోకలు స్తంభించి పోయాయి. వరదలకు కొద్ది మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంటల నష్టంపై భిన్నాభిప్రాయా లున్నాయి. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం పంట నష్టాన్ని తక్కువ చేసి చెబుతుందనే విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పంట నష్టం తక్కువగా చెప్పడం ద్వారా రైతులకు నష్టపరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని తగ్గించుకోవడం కోసమేననే అభిప్రాయాలు వస్తున్నాయి. పంటలు కోల్పోయిన రైతాంగానికి ఇచ్చే పరిహారం కూడా, వారికి ఊరట ఇవ్వటం లేదు. రైతు ఇప్పటికే ఎకరాకి రూ. 35 వేలు దాకా సేద్యానికి పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా మరో రూ. 15 వేలు కౌలు రూపంలో చెల్లించాడు. ప్రభుత్వం ప్రకటించే నష్ట పరిహారం ఎకరాకు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కనీసం ఎకరాకి రూ. 20 వేలు నష్ట పరిహారం ప్రకటించాలి.
కౌలు రైతులకు నష్ట పరిహారం సమస్యగా మారింది. వైసిపి పాలన కాలంలో పంటల బీమా పథకానికి ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించడం వల్ల పంట నష్టానికి కొంత మేరకు పరిహారం అందేది. కారణం తెలియదు గాని చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం తరపున ఈ సంవత్సరం ప్రీమియం చెల్లించలేదు. ఫలితంగా బీమా సంస్థల నుంచి రైతాంగానికి పరిహారం లభించక నష్టపోతున్నారు. బీమా పరిహారం లభించి ఉంటే, అది రైతుకు ఉపయోగం ఉండేది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇప్పటికే రైతులకు రూ. 595 కోట్లు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిఉంది. పంటలు ముంపునకు గురైనప్పుడు, రైతాంగం నుండి ఎటువంటి వంకలు పెట్టకుండా మద్దతు ఇచ్చి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి. మొంథా తుఫాన్ గురైన రైతుల నుండి పంట కొనుగోళ్లు చేయాలంటే, పంట నష్ట పరిహారం కోసం పేర్లు నమోదు చేసుకోరాదని, చేసుకుంటే నష్ట పోగా మిగిలిన పంటను మిల్లర్లు ఇచ్చే రేటుకు అమ్ముకోమని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశం లేదని అధికారులు కొన్ని ప్రాంతాల్లో రైతులకు తెగేసి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంపునకు గురైన పంటలకు మద్దతు ధర ఇచ్చే అవకాశం లేదని మిల్లర్లు చెబుతున్నారు. అలాంటప్పుడు మిల్లర్లు ఇచ్చిన ధరకే రైతులు అమ్ముకోవాలి.
ఫలితంగా రైతు తీవ్రంగా నష్టపోతాడు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరదలు రావటానికి, పంటలు ముంపుకి గురి కావటానికి కారణమైన నదుల, వాగుల, కాల్వల, చెరువుల కరకట్టలను పటిష్ట చేయడం, పూడికలు తీయడం, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. వీటి పట్ల రాష్ట్ర పాలకులు దృష్టి పెట్టకపోవడం వల్ల తుఫాన్ల సందర్భంగా పంటలకు అపార నష్టం జరుపుతున్నది. రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగం, మొంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయి మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కౌలు రైతులతోసహా నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ. 20 వేలు ఇవ్వాలి. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు రద్దు చేయాలి. పంటకాల్వల, డ్రైనేజీ కాల్వలను ఆధునీకరణ చేయాలి. సహాయం పొందడం పాలకుల భిక్షకాదని, అది తమ హక్కు అని రెండు రాష్ట్రాల రైతాంగం సాధనకు ఉద్యమించాలి.
బొల్లిముంత సాంబశివరావు
9885983526