మన తెలంగాణ/ క్రీడా విభాగం: కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేస్తూ టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడిన అపురూప సమయమిది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లోటీ భారత మహిళా జట్టు చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ సాధించిన చిరస్మరణీయ గెలుపుతో దేశం మొత్తం ఆనందంలో తేలిపోయింది. దేశంలోని చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని పట్టణాల్లో, నగరాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మైదానంలో పాదరసంలా కదిలిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. అంతే మైదానంలోని క్రికెటర్లు, స్టేడియంలోని అభిమానులు, టివిల ముందుకు కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించిన కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకుల ఆనంధానికి అవధులు లేకుండా పోయింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో టీమిండియా సాధించిన అపురూప విజయం భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు.
ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ బరిలోకి టీమిండియా ఏకంగా కప్పును సాధించి ఔరా అనిపించింది. భారత్ సాధించిన ఈ విజయంలో జట్టు సమష్టి ప్రతిభ దాగివుంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించలేక పోయారు. సెమీ ఫైనల్‌కు కూడా చేరుతుందా లేదా అనే దశను దాటి ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం అసాధారణ విషయంగానే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా క్రికెటర్ల ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగిన ప్రయాణాన్ని ప్రశంసించ కుండా ఉండలేం.
అదరగొట్టిన దీప్తి..
మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారత్ సాధించిన చారిత్రక విజయంలో దీప్తి ప్రదర్శన వేలకట్టలేనిది. బ్యాట్‌తో బంతితో ఆమె సాగించిన పోరాటాన్ని ప్రశంసించడానికి మాటలు చాలవు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత బ్యాటింగ్‌తో దీప్తి జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే అవుతోంది. సెమీ ఫైనల్, ఫైనల్లో మ్యాచుల్లో దీప్తి ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. అంతేగాక ఇతర మ్యాచుల్లో ఇటు బంతితో అటు బ్యాట్‌తో అలరించింది. ఒక మాటలో చెప్పాలంటే భారత్ ప్రపంచ కప్ ట్రోఫీని సాధించిందంటే దానికి దీప్తి ఆల్‌రౌండ్‌షోనే ప్రధాన కారణమని చెప్పాలి. కీలక సమయాల్లో దీప్తి కనబరిచిన అసాధారణ ప్రతిభ భారత క్రికెట్‌లో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పాలి.
జెమీమా అదరహో..
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సాధించిన చారిత్రక సెంచరీ కూడా ఈ వరల్డ్‌కప్ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌కు రికార్డు విజయం సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఫైనల్‌కు చేరిందంటే దానికి జెమీమా సాధించిన చారిత్రక శతకం చాలా కీలకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌లో సరికొత్త జోష్ నింపడానికి జెమీమా బ్యాటింగ్ ఒక ప్రధాన కారణమని చెప్పాలి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, దీప్తి, రిచా, అమన్‌జోత్‌లతో కలిసి జెమీమా టీమిండియాను విజయ తీరానికి చేర్చిన తీరును భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచి పోలేరు. మరోవైపు తెలుగు తేజం శ్రీ చరణి, ఫాస్ట్ బౌలర్ రేణుక సింగ్ ఠాకూర్, అమన్‌జోత్, దీప్తి, రిచా తదితరులు కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
హర్మన్‌ప్రీత్ ముద్ర..
టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వ ప్రతిభ దాగివుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హర్మన్ అసాధారణ కెప్టెన్సీకి ఈ విజయం నిదర్శంగా చెప్పక తప్పదు. తీవ్ర ఒత్తిడిలోనూ హర్మన్ జట్టును నడిపించిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు పేలవమైన బ్యాటింగ్, ఇంటాబయట విమర్శలతో హర్మన్‌ప్రీత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయినా వీటిని తట్టుకుంటూ హర్మన్ జట్టును ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని మరువ లేం. కీలక మ్యాచుల్లో హర్మన్‌ప్రీత్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచింది.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సహచర క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించిన తీరును భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా చెప్పొచ్చు. టీమిండియా సాధించిన అపురూప విజయంలో హర్మన్ పాత్రను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. మరోవైపు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్‌లు కూడా భారత్ విజయంలో తమవంతు పాత్రను సమర్థంగా పోషించారు. ప్రతీక రావల్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.
న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టింది. కానీ గాయం వల్ల మిగిలివున మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. లీగ్ దశలో సాధించిన విజయాల్లో ప్రతీక కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. మరోవైపు మంధాన కూడా కీలక సమయంలో పుంజుకుంది. అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది. కీలక మ్యాచుల్లో మంధాన ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూల అంశంగా మారింది.