శ్రీ సత్యసాయి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన సోమవారం అర్ధ రాత్రి దాటిన తర్వాత చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న జబ్బర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దామాజిపల్లి వద్దకు చేరుకున్నప్పుడు, ముందు వెళ్తున్న ఐషర్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అధిక వేగంతో ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డా రు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.