భారతదేశం బలం, వైవిధ్యం రాజ్యాంగ నైతికత పై ఆధారపడి ఉంది. ఎన్నికైన నాయకులు పెడ ధోరణి పట్టినప్పుడు ప్రతిఘటించడం పౌరులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, మీడియా విధి అవుతుంది. అన్యాయాలను మౌనంగా సహించడం అన్యాయాలను సమర్థిం చడమే. వలసలు, పోరాటం, సాంసృ్కతిక ఐక్యతతో కూడిన ఉమ్మడి చరిత్రలతో ముడిపడి ఉన్న అసోం, బెంగాల్ రాష్ట్రాలు రెండు ద్వేష రాజకీయాల ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించరాదు. వీరంతా భారతీయులే. ద్వేషపూరితమైన కంచెలు భౌగోళిక సరిహద్దుల కన్నా ప్రమాదకరమైనవి. అసోంలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామనడం, బెంగాల్‌లో బంగ్లాదేశ్ తో కంచెలు వేయమని హామీ ఇవ్వడం బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు తార్కాణం. సిఎఎ ఈ వైఖరికి ప్రతీకగా నిలుస్తుంది.
నైతికత స్థానే రాజకీయ ఆశయం చోటుచేసుకున్ననప్పుడు పాలన మోసపూరితంగా మారుతుంది. అసోం నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ అడుగడుగునా అదే కన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిజెపి ఎంపి జగన్నాథ్ సర్కార్ తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ముళ్ల కంచెను తొలగిస్తుందని ఈ మధ్య చేసిన వ్యాఖ్య -వలసలు, సరిహద్దులు, జాతీయవాదంపై బిజెపి రాజకీయాల్లోని వైరుధ్యాన్ని స్పష్టం చేస్తున్నది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను ఆపడం, ముఖ్యంగా అసోంలో అక్రమ వలసదారులను బహిష్కరించడంపై పార్టీ ఏళ్లుగా చేస్తున్న వాదనకు ఇది విరుద్ధంగా ఉంది. బిజెపి సీనియర్ ఎంపి చేసిన వ్యాఖ్య పశ్చిమ బెంగాల్ లోనే కాక, ఈశాన్య భారతంలో, మరీ ముఖ్యంగా అసోంలో ఆగ్రహాన్ని, అనుమానాలను రేకెత్తించింది. ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రత, అక్రమ వలసలు దశాబ్దాలుగా రాజకీయంగా, భావోద్వేగ పరంగా సున్నితమైన అంశం.
అసోం ఒప్పందం, భద్రతా పరమైన రక్షణ
2016లో అసోంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు, అది స్థానిక అసోమీ ప్రజల గుర్తింపు, హక్కులను కాపాడతామని స్పష్టమైన వాగ్దానం చేసింది. 2016, 2021 ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి 1985 అసోం ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీఇచ్చింది. ఆల్ అసోం స్టూడెంట్స్, యూనియన్ (ఆసు) నేతృత్వంలో ఏళ్లతరబడి సాగిన ఆందోళన తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అసోం నుంచి విదేశీయులను గుర్తించి బహిష్కరించడానికి 1971 మార్చి 25ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. మున్ముందు చొరబాట్లను నిరోధించడానికి భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె వేయాలని కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. అసోం ఒప్పందం కేవలం ఓ డాక్యుమెంట్ మాత్రమే కాదు. దేస జనాభా సమతౌల్యత కాపాడుకునేందుకు వందలాదిమంది అసోమీ యువకుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఒప్పందం. ఇది రక్షణకు హామీ, అసోం భాష, సాంసృ్కతిక, రాజకీయ గుర్తింపు నీరుగారబోదని ఇచ్చిన వాగ్దానం. అయినా, బిజెపి ఒప్పందం పట్ల విధేయత చూపుతోనే, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తీసుకువచ్చింది. ఇది ఒప్పందం ప్రాథమిక స్ఫూర్తిని సమర్థవంతంగా మోసం చేసే చట్టం. 1971 గడువు తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో ప్రవేశించిన హిందూ బెంగాలీలకు పౌరసత్వం ఇవ్వడంద్వారా బిజెపి అసోం ఒప్పందం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించింది.సిఎఎ, అసోం ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి త్యాగాలను దెబ్బతీయడమే కాక, బిజెపి ద్వంద్వ వైఖరిని బయటపెడుతుంది. ఒకపక్క ఇది ముస్లంలను చొరబాటుదారులు అని ఆరోపిస్తుంది, వారి బహిష్కరణకు వాగ్దానం చేస్తుంది. మరోపక్క ముస్లిమేతర వలసదారులకు, ముఖ్యంగా హిందూ బెంగాలీలకు పూర్తి పౌరసత్వాన్ని అందిస్తుంది. వీరిలో చాలా మంది 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన వారే. ఇది కేవలం రాజకీయ అవకాశవాదమే కాదు, భావజాలంతో కూడిన ద్రోహం.
వలసల విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి
వలసలపై బిజెపి రాజకీయాలు ఎప్పుడూ ద్వంద్వ ప్రమాణాలతో కూడినవే. అసోంలో ఆ పార్టీ నాయకులు అక్రమ బంగ్లాదేశ్ ముస్లింలను బహిష్కరణకు గగ్గోలు పెడుతున్నారు. బెంగాల్‌లో, కేంద్రంలో మరి కొందరు సరిహద్దులను తెరుస్తామని, ముళ్లకంచెలను తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. చొరబాటు అంశం వివిధ రాష్ట్రాలలో ఎన్నికల లబ్ధి కోసం సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు కన్పిస్తోంది. భారతదేశ సరిహద్దులను రక్షించడం, అసోం ఒప్పందం పవిత్రతను కాపాడడంలో బిజెపికి నమ్మకం ఉంటే పార్టీ సీనియర్ ఎంపి, భారత- బంగ్లా సరిహద్దుల్లో ముళ్లకంచె తొలగిస్తామని ఎలా అంటారు. ఇది సరిహద్దు భద్రతకోసం అసోం ప్రజల పోరాటాన్ని అపహాస్యం చేయడం కాదా? ఈ అంశంలో వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోంది. అసోంలో లక్షలాది మందిని – “డి- ఓటర్లు”, “చొరబాటుదారులు” అని ముద్రవేసిన కాషాయదళం ఇప్పుడు బెంగాల్‌లో బంగ్లాదేశ్‌తో సరిహద్దులు లేని ఐక్యతపై మాట్లాడుతోంది. ఇది జాతీయవాదం కాదు. కేవలం కపటత్వమే.
అసోం ముఖ్యమంత్రి ద్వేషపూరిత రాజకీయాలు
అసోం ముఖ్యమంత్రి ఈ విభజనను మరింత పెంచారు. విభిన్న సంసృ్కతులు, భాషలు, విశ్వాసాలకు నిలయంగా ఉన్న అసోంలో కీలక పదవిలో ఉన్న ఆయన తన రాజకీయ వేదికను ద్వేషం, బహిష్కరణలకు వేదికగా మార్చుకు న్నారు. రాష్ట్రంలో కొన్ని తరాలుగా నివసిస్తున్న బెంగాలీ సంతతికి చెందిన ముస్లింలు, మియా ముస్లింలను- బహిష్కరిస్తామని తరచు ఆయన బెదిరించడం, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ వాగ్దానాన్ని ఉల్లంఘించడమే. ఆక్రమణలను తొలగించే నెపంతో వేలాది ముస్లిం కుటుంబాలను ఇప్పటికే ప్రభుత్వ, అటవీ భూములనుంచి బహిష్కరించారు. ఈ చర్యలు ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్న గ్రామాలను టార్గెట్ చేయడమే. అవి నిరాశ, ఆవేదనలను మిగిల్చాయి. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బంగ్లాదేశ్ ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని సిఎం పదేపదే చెప్పడం మతపరమైన విద్వేషాన్ని మరింత పెంచుతోంది. మతం ఆధారంగా విధేయత, ద్రోహం అని విభజించడం ఓ ప్రమాదకరమైన ప్రయత్నం. ఇది భారతదేశ, లౌకిక, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైన ఆలోచనే. ముఖ్యమంత్రి సొంత ప్రజల్లో ఒక వర్గంపై బహిరంగ యుద్ధం ప్రకటించడం, వారిని బయటి వ్యక్తులుగా ముద్రవేయడం పాలనా పరిమైన సమస్యమే కాదు, అది నైతిక సంక్షోభంగా మారుతుంది.
“అమర్ సోనార్ బంగ్లా” వివాదం
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన “అమర్ సోనార్ బంగ్లా” బంగ్లాదేశ్ జాతీయ గీతం. కాంగ్రెస్ నాయకులు ఈ గీతాన్ని పాడడంపై బిజెపి వివాదం సృష్టించడం అసంబద్ధతను ప్రతిబింబిస్తుంది. బ్రిటీష్ హయాంలో 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా ఠాగూర్ రాసిన పాట విభజనకు కాదు. ఐక్యతకు సంబందించిన గీతం. మతపరమైన, రాజకీయ సరిహద్దులు ఏర్పడక ముందు బెంగాల్ సమైక్య వారసత్వాన్ని ప్రతిబింబించిన గీతం. అయినా, ఈ గీతం ఆలపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించడం, జాతి వ్యతిరేక గీతంగా ముద్రవేయడం దారుణం. వలసవాద వ్యతిరేక ప్రతిఘటన, ఠాగూర్ మానవతా వాదం సార్వత్రికను సూచించే పాట పట్ల అసహనం వ్యక్తం చేయడం దివాలా కోరుతనం. అభద్రతా భావాన్ని ప్రతిబింబిస్తుంది. కంచెలను తొలగించడం, బెంగాల్, బంగ్లాదేశ్‌లను ఏకం చేయడం గురించి మాట్లాడుతున్న అదే బిజెపి ఎంపి, అమర్ సోనార్ బంగ్లా పాటపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరం.
ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ముప్పు
1950లో భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు అది మతం, జాతితో సంబంధం లేకుండా, పౌరులు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని వాగ్దానం చేసింది. ప్రతి ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయంలో రాజ్యాంగాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోనని వాగ్దానం చేస్తారు. అసోం ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉంటూ, ఒక వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని, వారిని ఇళ్లనుంచి వెళ్లగొట్టి, వారి పౌరసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘనతో పాటు, ప్రజాస్వామ్యానికి ముప్పు భావించవచ్చు. అధికారంలో ఉన్నవారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యం పతనం మొదలవుతుంది. ఆ మనస్తత్వమే నిరంకుశ ధోరణులకు దారితీస్తుంది. భారతదేశం బలం, వైవిధ్యం రాజ్యాంగ నైతికతపై ఆధారపడి ఉంది. ఎన్నికైన నాయకులు పెడ ధోరణి పట్టినప్పుడు ప్రతిఘటించడం పౌరులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, మీడియా విధి అవుతుంది.
అన్యాయాలను మౌనంగా సహించడం అన్యాయాలను సమర్థించడమే. వలసలు, పోరాటం, సాంసృ్కతిక ఐక్యతతో కూడిన ఉమ్మడి చరిత్రలతో ముడిపడి ఉన్న అసోం, బెంగాల్ రాష్ట్రాలు రెండు ద్వేష రాజకీయాల ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించరాదు. వీరంతా భారతీయులే. ద్వేషపూరితమైన కంచెలు భౌగోళిక సరిహద్దులకన్నా ప్రమాదకరమైనవి. అసోంలో అక్రమవలసదారులను బహిష్కరిస్తామనడం, బెంగాల్‌లో బంగ్లాదేశ్ తో కంచెలు వేయమని హామీ ఇవ్వడం బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు తార్కాణం. సిఎఎ ఈ వైఖరికి ప్రతీకగా నిలుస్తుంది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తన ఇలాగే కొనసాగితే, భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణించే పరిస్థితి తలెత్తవచ్చు. మైనారిటీలను అమానవీయంగా చూస్తే ప్రజాస్వామ్యం ఓ నినాదంగా మారే ప్రమాదం ఉంది. ఈ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా పోరాడాలి. రాజ్యాంగమే భారత దేశానికి నిజమైన సంరక్షణ కల్పిస్తుందని అధికారంలో ఉన్నవారికి గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
గీతార్థ పాఠక్