రైతును విస్మరిస్తే రాజ్యం బాగుపడదని జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇక్కడి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రంగం రైతులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. రైతుకు అన్యాయం చేయ వద్దని హితవు పలికారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంతో ఆ దిశగా ముందుకు సాగుతున్నామని, తమ ఎజెండా నచ్చినవారిని, నచ్చని వారిని స్వాగతం పలుకుతున్నామని అన్నారు. నాలుగు నెలల పాటు ప్రజల తో మమేకమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇస్తామన్నారు. జాగృతిని బలోపేతం చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎక్కడికి వెళ్ళినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని అన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని అన్నారు. జిల్లాలో చరాఖ, కోరట, కుప్తి ప్రాజెక్టులు కావలసిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న కొమురంభీమ్ కాలనీలోని 181 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్ద వారికి ధారాదత్తం చేశారని ఆరోపించారు. బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేసేందుకు జాగృతి శ్రేణులు పోరాటం చేయనున్నట్లు చెప్పారు. బోథ్ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. ఆదిలాబాద్‌లో ఐటి టవర్, ఎయిర్‌పోర్ట్, పఠాన్ చెరువు, ఆర్మూర్, ఆదిలాబాద్ రైల్వే లైన్, కొత్త పరిశ్రమలు లేవని, వీటి వల్ల ఆదిలాబాద్ మరింతగా అభివృద్ధి జరిగేదని అభిప్రాయపడ్డారు. ఈ విలేకరుల సమావేశంలో ఆదిలాబాద్ జాగృతి నాయకులు శ్రీనివాస్ రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.