ఇండోర్: దేశంలో బస్సు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాలను మిగిల్చాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఇండోర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ విషాదకర సంఘటనలో ముగ్గురు మరణించగా, 38 మంది గాయపడ్డారు. ఇండోర్, మోవ్ మధ్య ఉన్న సిమ్రోల్ భేరు ఘాట్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా గాయపడ్డారు. మరో తొమ్మిది మందిని ఇండోర్‌లోని MY ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
జిల్లా కలెక్టర్ శివం వర్మ మాట్లాడుతూ.. “ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నాము. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా అనే విషయాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాము. గాయపడినవారు చికిత్స పొందుతున్నారు” అని తెలిపారు.
ఎక్స్-గ్రేషియా ప్రకటించిన సిఎం మోహన్ యాదవ్
ఈ బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఇండోర్-మోవ్ మధ్య బస్సు బోల్తా పడి ముగ్గురు పౌరులు మరణించడం చాలా హృదయ విదారకం. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి మెరుగైన ఉచిత చికిత్స అందించాలని అధికారులను సిఎం ఆదేశించారు.