హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సంక్షేమ శాఖ ప్రత్యేక సిఎస్ ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని జివొ జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కోదండరాం, కంచె ఐలయ్య, ఆర్థిక, విద్య, ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఉన్నత విద్యాసంస్థల నుంచి ముగ్గురు ప్రతినిధులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పాలసీపై కమిటీ సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్టు ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం జివొలో పేర్కొంది. విద్యాసంస్థలు పేర్కొన్న సూచనలపై కమిటీ అధ్యయనం చేయనుంది. గత నెల 28న ఇచ్చిన జివొను ప్రభుత్వం బయటపెట్టింది.