మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీ లు మరోసారి అల్టిమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలను చె ల్లించకపోతే లిక్కర్ ఉత్పత్తి ఆపేస్తామని హెచ్చరించాయి. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం నుంచి రూ.3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని కంపెనీల సంఘం స్పష్టం చేసింది. ఈ బకాయిల్లో రూ.2,300 కోట్లకు పైగా గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం ఈ ప్రభుత్వం రూ.1,366 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో సరఫరా సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతోపాటు తాత్కాలికంగా అడ్వాన్స్ ఎక్సైజ్ డ్యూటీని 30 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి.