హైదరాబాద్: నాలుగేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు పాల్పడిన జ్ఞానేశ్వర్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని బోయిన్‌పల్లి పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓల్డ్ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్ తన వద్ద డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చే నాలుగేళ్ల చిన్నారితో స్టూడియోలో ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఆ చిన్నారి డ్యాన్స్ స్టూడియోకు వెళ్లను అని మారాం చేసింది. ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. జ్ఞానేశ్వర్ తనని లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వర్‌ను రిమాండ్‌కు తరలించి స్టూడియోను సీజ్ చేసినట్లు ఉత్తర మండల డిసిపి రష్మీ పెరుమాళ్ తెలిపారు.