జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్‌ను మంగళవారం సాగర్ సొసైటీలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు కలిసి చర్చించారు. జనసేన అధినేత, ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు శంకర్ గౌడ్ బిజెపి ముఖ్య నాయకులతో మంతనాలు జరిపారు.
బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఒక రోజు రోడ్-షో, బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు. జనసేన ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీ కాబట్టి తప్పకుండా ప్రచారంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. బిజెపికి మద్దతుగా తెలంగాణ జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తారు. ఇరు పార్టీల నాయకులు బుధవారం ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటించనున్నారు.