మన తెలంగాణ/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, మిర్జాగూడ గేటు సమీపంలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆర్‌టిసి బస్సును ఢీకొట్టడంతో 19మంది మృత్యువాత పడ్డారు. తాం డూరు డిపోకు చెందిన బస్సు ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో సుమారు 70మంది ప్రయాణికులు ఉన్నారు. చే వెళ్ల మండలం, ఖానాపూర్- మిర్జాగూడ గేటు వద్ద కు రాగానే చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి బస్సు ను ఢీకొట్టింది. ఈ వేగానికి టిప్పర్‌లోని కంకర బస్సులోకి ఎగిసి పడడంతో అందులోని ప్రయాణికులంతా కంకరలో కూరుకుపోయారు. ఏం జరిగిందో అనే తెలుసుకునే లోపల 10 మంది ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలను కోల్పోయారు. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సు మీదకి దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కంకరలో కూరుకుపోయిన వారిని మూడు జెసిబిల సహాయంతో కంకరను తొలగించి బయటకు తీశారు.
సంఘటనా స్థలంలోనే 15 మంది మృతి చెందగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు, అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, పట్నం మహేందర్‌రెడ్డి ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందజేస్తున్నారు. ఉదయం మిర్జాగూడ గేటు సమీపంలో బస్సు ప్రమాద సమాచారం తెలుసుకున్న చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. మూడు జెసిబిలు, క్రేన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో స హాయక చర్యలు చేపడుతున్న సమయంలో జెసిబి చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపై నుంచి వెళ్లడంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాద ఘటనతో బీజాపూర్‌హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారిపై అటు ఇటు సుమారు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు, నాలుగు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
బంధువులకు అప్పగింత
సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మ రణించిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఈ దుర్ఘటనలో ఆర్‌టిసి బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మం ది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా తాండూరువాసు లు ఉన్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవే ట్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన వై ద్యులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించారు. తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు మృతదేహాల కు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అ నంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగించారు.మృతదేహాలను వారి స్వస్థలాలకు పం పించారు. నాగమణి మృతదేహం కర్ణాటకలోని భా నూర్‌కు తరలించారు. అనూష, సాయిప్రియ, నం దిని, నజీర్ అహ్మద్, విద్యార్థి అఖిల మృతదేహాలను తాండూరుకు పంపించారు. కల్పన, గుణమ్మ మృతదేహాలు హైదరాబాద్‌లోని బోరబండకు.. తారాబా యి మృతదేహం గంగారం తండాకు తరలించారు.