మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై ఈ నెల నుంచి తిరిగి విచారణ చేపట్టాలని అసెంబ్లీ స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం షెడ్యూలు ప్రకటించింది.ఈనెల 6న డాక్టర్ సంజయ్, 7న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, 12న తెల్లం వెంకట్రా వు, 13న అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్ల పై విచారణ చేపట్టనున్నారు. తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలను స్పీకర్ ప్ర సాద్ కుమార్ వింటారు. అనంతరం ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిరాయింపు ఎం ఎల్‌ఎలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇదివరకే ప్రకాష్‌గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల విచారణ ఇటీవల ముగిసింది. ఇదిలాఉండగా మొత్తం పది మంది ఎంఎల్‌ఎలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ కార్యాలయం నుంచి పది మందికీ నోటీసులు వెళ్ళగా, అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంత వరకూ కౌంటర్ దాఖలు చేయలేదు.
సుప్రీం జోక్యం..
తాము పది మంది ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా స్పీకర్ కనీసం వారికి నోటీసులు కూడా పంపించలేదంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు సూచించింది. దీంతో వెంటనే నోటీసులు పంపించి విచారణ చేపట్టారు. ఆ గడువు అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. తమకు అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ల కాన్ఫరెన్స్‌కు వెళ్ళడం ద్వారా సమయం సరిపోలేదని, ఇంకా నలుగురు ఎంఎల్‌ఎల విచారణ పూర్తి చేయడానికి మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు మిగతా నలుగురు ఎంఎల్‌ఎల విచారణ పూర్తి చేయడానికి విచారణ చేపట్టనున్నారు.
కడియం, దానం సంగతి ?
మరోవైపు ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారోనని వివిధ పార్టీల నాయకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.