ముంబై: ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత మహిళా క్రికెట్ టీమ్‌కు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ నగదు నజరానాను ప్రకటించింది. టీమిండియాకు రూ.51 కోట్ల నగదు బహుమతిని అందించాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా చారిత్రక విజయం సాధించిందని సైకియా ప్రశంసించారు. చిరస్మరణీయ విజయంతో కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేసిన మహిళా క్రికెట్ టీమ్‌కు తమవంతు నజరానాగా రూ.51 కోట్లను నజరానాగా అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ నగదును క్రికెటర్లతో పాటు కోచ్‌లు, సహాయక సిబ్బందికి అందిస్తామని వివరించారు. జైషా బిసిసిఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళా క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టారని, ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మకమైన డబ్లూపిఎల్ టి20 లీగ్‌కు శ్రీకారం చుట్టారని సైకియా ప్రశంసించారు.
మహిళా క్రికెటర్లకు డైమెండ్ నెక్లెస్‌లు
సూరత్: మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత క్రికెట్ జట్టుపై కనక వర్షం కురుస్తోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది భారతీయులను గర్వపడేలా చేసిన మహిళా క్రికెట్‌కు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలాకియా భారీ నజరానాను ప్రకటించారు. ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ సభ్యులకు వజ్రాల ఆభరణాలు (డైమండ్ నెక్లెస్)లతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వాలని ఢోలాకియా నిర్ణయించారు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఢోలాకియా బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీ శుక్లాకు ఓ లేఖ పంపారు. భారత్ ట్రోఫీ సాధిస్తే జట్టులోని ప్రతి క్రికెటర్‌కు వజ్రాల ఆభరణాలన కానుకగా ఇవ్వాలనుకుంటున్నా అని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేగాక క్రికెటర్ల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తానని వివరించారు. ఇక భారత మహిళా టీమ్ విశ్వవిజేతగా నిలువడంతో గోవింద్ ఢోలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు.