బెంగళూరు: సౌతాఫ్రికాఎతో జరిగిన తొలి అనధికార టెస్టు మ్యాచ్‌లో ఇండియాఎ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి చేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శణ్ (12), అయుశ్ మాత్రె (6)లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. ఈ దశలో రజత్ పటిదార్‌తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన పటిదార్ 87 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన అయుశ్ బడోనితో కలిసి పంత్ పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బడోని 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. తనుష్ కొటియన్ (23), మానవ్ సుతార్ 20 (నాటౌట్), అన్షుల్ కంబోజ్ 37 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో తమవంతు సహకారం అందించారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. కాగా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 309, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు మాత్రమే చేసింది.