పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందు కురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది.
రాష్ర్టంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. విద్యాసంస్థల ఆందోళనలు, విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 1200 కోట్ల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేస్తామని, దానిలో రూ. 600 కోట్లను దసరాకు, మిగతా రూ. 600 కోట్లను దీపావళికి ఇస్తామని ప్రకటించింది. విద్యాసంస్థలు, విద్యార్థి సంఘా లు సర్కార్ ప్రకటనను నమ్మాయి. కానీ పండగల పేరుతో కాలయాపన జరిగింది గాని విద్యార్థులకు న్యాయం జరగలేదు.
ఫలితంగా ఎప్పటి లాగానే లక్షలాది మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రాక, ఆర్థిక భారం తో చదువులను కొనసాగించలేక, ఉన్నత చదువులు చదువుకోలేక తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెంటనే చెల్లిస్తామని నమ్మ బలికింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన రీయింబర్స్‌మెంట్ హామీని అటకెక్కించింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయని ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మరొక కొత్త కుట్రకు తెరలేపింది.
రీయింబర్స్‌మెంట్‌ను కాలేజ్ అకౌంట్‌లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్‌లో వేస్తామని ప్రకటించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలే కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా మొత్తం ఫీజు ముందు చెల్లిస్తేనే వారికి ఆయా కాలేజీల్లో సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతో తీవ్రమైన ఆర్థిక భారం పేద విద్యార్థులపై పడుతుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందుకురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది.
దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది. రాష్ర్టంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, జెఎన్‌టియు, తెలంగాణ యూనివర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ యూనివర్శిటీలకు కూడా వందల కోట్ల పెండింగ్ బిల్లులు రావలసి ఉంది. ఈ యూనివర్శిటీలన్నీ నిధులు లేక, సౌకర్యాలు లేక, చదువు చెప్పే ప్రొఫెసర్లు లేక దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతున్నాయి. ఈ పెండింగ్ నిధులు విడుదలయితే కొంతైనా పరిస్థితి మెరుగుపడవచ్చు. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ అడిగిన విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై కక్ష గట్టింది. విద్యార్థుల పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.
రీయింబర్స్‌మెంట్ సాధించడం కోసం అనేక సార్లుగా ఆందోళనలు చేసినా, పోరాటాలు నిర్వహించినా, విద్యాసంస్థల బందును నిర్వహించినా కూడా కనీసం స్పందించలేదు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలను మూసివేస్తామని హెచ్చరించిన ఫలితంగా వారితో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరిపి రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. నేడు వారి హామీని నెరవేర్చని ఫలితంగా మరొకసారి నిరవధికంగా నవంబర్ 3 నుండి విద్యాసంస్థలను మూసివేస్తామని ప్రకటించాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుంటే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవలసిన రాష్ర్ట విద్యాశాఖ అధికారులు నాడు చోద్యం చూసింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్శిటీలు ఏమాత్రం నిబంధనలు పాటించకుండా లక్షలరూపాయలను డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్నప్పుడు రాష్ర్ట ప్రభుత్వం స్పందించలేదు.
అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఫీజులు పెంచుకున్నప్పుడు, సరైన సదుపాయాలు కల్పించనప్పుడు, నిబంధనలకు తూట్లు పొడిచినప్పుడు, విద్యారంగంపై ఉన్న జిఒలను అమలు చేయనప్పుడు విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే నాడు పట్టించుకోలేదు. కానీ నేడు రీయింబర్స్‌మెంట్ అడగగానే విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సబబు కాదు. రీయింబర్స్‌మెంట్ విడుదలపై రాష్ర్ట ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించకుండా భేషజాలకు పోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన రాష్ర్ట ప్రభుత్వం దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడటం శోచనీయం. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదలపై ఉద్యమించాల్సిన గురుతర బాధ్యత నేడు విద్యార్థి లోకంపై ఉంది. ఐక్యపోరాటాలను నిర్మించాల్సిన తక్షణ కర్తవ్యం నేడు విద్యార్థి సంఘాలపై ఉంది.
పి.మహేష్
97003 46942