జైపూర్ :రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం మధ్యాహ్నం ఆగిఉన్న దాదాపు 17 వాహనాలను ఢీకొని డ్రంపర్ ట్రక్కు దూసుకుపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆగ్రాకు చెందిన నాన్‌జీ భాయి కుటుంబం ఉంది. నాన్‌జీ భాయి, ఆయన సోదరుడు, ఇద్దరు మహిళలు, ఒక పసివాడు ఖతుశ్యామ్‌జీ ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
హర్మదా ఏరియా లోని లోహమండి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలన్నీచెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ధ్వంసమైన కార్లతో రోడ్డంతా నిండిపోయింది. డంపర్ చక్రాల కింద అనేక మోటారు బైకులు నలిగిపోయాయి. వాహనాలను డ్రంపర్ 300 మీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్‌మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు చెప్పారు. డ్రైవరును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శిధిలమైన వాహనాల నుంచి కొన్నిమృతదేహాలను స్థానికులు బయటకు తీయగలిగారు.
రోడ్డు నెం.14 నుంచి వచ్చిన డంపర్ లోహమండి పెట్రోల్ పంప్‌వద్దకు అత్యంత వేగంగా దూసుకువచ్చిందని దారిలో ఉన్న వాహనాలను ఢీకొంటూ వెళ్లిందని జైపూర్ జిల్లా కలెక్టర్ జితేంద్ర సోని వివరించారు. గాయపడిన వారికి ఎస్‌ఎంఎస్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌లో చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ, డిప్యూటీలు దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా, మాజీ సిఎం అశోక్‌గెహ్లాట్ మృతులకుటుంబాలకు తీరని సంతాపం తెలియజేశారు. రాజస్థాన్‌లో ఆది, సోమవారాల్లో వరుసగా రెండు ప్రమాదాలు జరిగాయి. ఆదివారం సాయంత్రం ఫలోడీ ఏరియాలో ఆటెంపోట్రావెలర్, స్టేషనరీ టాయిలర్ ఢీకొని పదిమంది మహిళలతోసహా మొత్తం 15 మంది మృతి చెందారు.