హైదరాబాద్: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల ఘటనలో 19 మంది చనిపోయారని అన్నారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశామని పొన్నం తెలియజేశారు. 72 మంది ప్రయాణికులతో బస్సు వస్తుండగా కంకర టిప్పర్ ఢీకొందని, మృతుల కుటుంబాలకు సాయం కోసం అధికారులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారని, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించామని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదు అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.