ఫైనల్లో సఫారీలు చిత్తు
దీప్తిశర్మ, షఫాలీ వర్మ ఆల్‌రౌండ్ షో
సౌతాఫ్రికా కెప్టెన్ వోల్వార్డ్ సెంచరీ వృథా
తొలిసారి వన్డే వరల్డ్ కప్ కైవసం
టీమిండియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు
నవీ ముంబై: ప్రతిష్ఠాత్మకమైన మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో టీమిండియా 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. భారత మహిళా జట్టు ప్రపంచకప్ ట్రోఫీని గెలుచు కోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సఫారీ కెప్టెన్ లౌరా వోల్వార్ట్ (101) అద్భుత సెంచరీ సాధించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లను పడగొట్టి టీమిండియాకు చారిత్రక విజయం సాధించి పెట్టారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు, షఫాలీ రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధానలు అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇద్దరు సఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మంధాన సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, షఫాలీ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఇటు మంధాన అటు షఫాలీ కుదురు కోవడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మంధాన 58 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.ఇదే సమయంలో షఫాలీతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
మరోవైపు షఫాలీ 78 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 87 పరుగులు చేసి పెవిలియన్ చేరింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (24) ఈసారి ఆశించిన స్థాయిలో రాణించలేక పోయింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా ఈసారి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా పెద్దగా రాణించలేదు. 2 ఫోర్లతో 20 పరుగులు చేసి వెనుదిరిగింది. అమన్‌జోత్ కౌర్ (12) కూడా నిరాశ పరిచింది. కానీ దీప్తి శర్మ, వికెట్ కీపర్ రిచా ఘోష్‌లు అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన దీప్తి శర్మ 58 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 58 పరుగులు సాధించింది. మరోవైపు రిచా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లపై ఎదురు దాడి చేసిన రిచా 24 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 34 పరుగులు సాధించింది. కీలక బ్యాటలందరూ తమవంతు పాత్ర పోషించడంతో భారత్ ప్రత్యర్థి ముందు మెరుగైన లక్ష్యాన్ని సఫలమైంది.