కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రెండు ప్రధానమైన రకాలు లేదా శైలులు. ఈ రెండూ మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండాల్లో రసికుల విశేష ఆదరణను చూరగొన్నా యి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారత దేశంలో ఉద్భవించింది. దానిమీద పర్షియన్, అఫ్గాన్, మొగల్ సంగీత సంప్రదాయాల ప్రభావం ఉంది. కర్ణాటక శైలి, ప్రాచీన వేద సంప్రదాయాన్నీ, దేవాలయాల సంప్రదాయాన్నీ పుణికి పుచ్చుకున్నది. పేరులో కర్ణాటక ఉంది కనుక, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినదని అపోహ పడేవాళ్లుంటారు కొందరు. కానీ కర్ణాటక అనే సంస్కృత శబ్దానికి దక్షిణ భారత దేశం అని అర్థం. కర్ణము అంటే చెవి కాబట్టి, చెవులకు ఇంపైనది కర్ణాటక సంగీ తం అని భావించే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ ఊహ సంబద్ధమైనది కాదు.
హిందుస్తానీ సంగీతం స్వర (సుర్) ప్రధానమైనది, కర్ణాటక శైలిలోనేమో తాళం ముఖ్యం అని చెప్పవచ్చు స్థూలంగా. కానీ ఈ వాక్యాన్ని categorical comment (నిర్ద్వంద్వ వ్యాఖ్య) గా చెప్పకూడదు. స్వరం, తాళం పరస్పరం ఆశ్రితాలు అని రెండు శైలులూ ఒప్పుకుంటాయి.
ఘరానాలు హిందుస్తానీ పద్ధతిలో మాత్రమే ఉన్నాయి. గ్వాలియర్ ఘరానా చాలా ప్రాచీనమైనది,16వ శతాబ్దం నాటిది. దీనిలో స్వరశుద్ధతకు, తళుకుబెళుకులు లేని రాగప్రస్తారానికి ప్రాధాన్యమిస్తారు. టప్పా అనే ఉపశాస్త్రీయ శైలి మొదట ఈ ఘరానాలో, తర్వాత బనారస్ ఘరానాలో వృద్ధి చెందింది. మైహర్ ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఈయన కూ తురైన విదుషి అన్నపూర్ణా దేవి గొప్ప విద్యాంసు రాలు. ఈ ఘరానా కళాకారులు ఎక్కువ వరకు వాద్యసంగీతకారులు. కిరాణా ఘరానా శ్రుతిశుద్ధికి ప్రసిద్ధమైనది. దీనికి మూలస్తంభం అనదగినవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్. ఇతని ఠుమ్రీ గాయనాన్ని విని, సంగీతాన్ని నేర్చుకునేందుకు పండిత్ భీమ్ సేన్ జోషి చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయాడు.
జైపూర్- అత్రోలి ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అరుదైన, క్లిష్టమైన రాగాలకు, లయకారికి ప్రాధాన్యమిస్తారు ఈ ఘరానా వాళ్లు. పటియాలా ఘరానాను అలీ బక్ష్, ఫతే అలీఖాన్‌లు స్థాపించారు. ఉస్తాద్ బడే గులామలీ ఖాన్, రాషిద్ ఖాన్‌లు దీనిలోని ముఖ్యులు. ఉల్లాసకరమైన, అలంకృత శైలి వీరి ప్రత్యేకత. వీరు ఎక్కువగా శుద్ధ శాస్త్రీయ ప్రక్రియలైన ధ్రు పద్, ఖ్యాల్‌లు కాకుండా ఠుమ్రీలు, ఉపశాస్త్రీయ బందిష్‌లను పాడుతారు. వీరి గాయనంలోని మీండ్ (ఒక స్వరం నుండి మరొక స్వరానికి మెల్లగా జారడం) చాలా ఆకర్షణీయంగా ఉం టుంది. బనారస్ ఘరానా 18వ శతాబ్దం నాటి ది. ఇది పూరబ్ అంగ్ ఠుమ్రీకి పుట్టినిల్లు. దాద్రా, కజ్రీ, చైతీ, హోరీ మొదలైన ఉపశాస్త్రీయ శైలులు ఇక్కడ వృద్ధి చెందాయి. ఇవిగాక భేండీ బజార్ ఘరానా, ఆగ్రా ఘరానా, ఇటావా ఘ రానా మరికొన్ని ఉన్నాయి. కర్ణాటక సంగీతం లో ఘరానాలు లేకపోయినా గురుశిష్య పరంపర పద్ధతి, బాణీ పద్ధతి ఉన్నాయి. ఉదాహరణకు అరియక్కుడి, సెమ్మంగుడి, మదురై మణి అయ్యర్‌ల బాణీ పద్ధతులను వారి శిష్య ప్రశిష్యులు గానం చేస్తున్నారు. వీటిని schools of singing అంటారు.
హిందుస్తానీ సంగీతంలో ప్రాతఃకాలం నుండి మళ్లీ ప్రాతఃకాలం వరకు ప్రతి 3గంటల వ్యవధి కొకటి చొప్పున సమయాన్ని 8విభాగాలుగా విభజించి, వాటికి రాగాలను కేటాయించారు. ఆ రా గాలను ఆ సమయాల్లోనే పాడాలనే నియమం ఉంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులున్నా యి. ఉదాహరణకు, మల్హార్ రాగాలను వర్ష రుతువులో ఏ సమయంలోనైనా పాడవచ్చు. అదేవిధంగా దుర్గా రాగాన్ని సాధారణంగా రాత్రి వేళలోనే పాడాలి కానీ, ఉదయం వేళ పాడే దుర్గా రాగం కూడా ఒకటి ఉంది. దీన్ని ‘ప్రాతః దుర్గా’ అంటారు. అంత కఠినమైనవి కాకపోయినా, కర్ణాటక పద్ధతిలో స్థూలంగా కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకు భైరవి రాగాన్ని ఉదయం వేళ, శంకరాభరణంను రాత్రివేళ పాడాలని చెప్పేవారు మొదట్లో. కానీ కల్యాణి, భైరవి రాగాలను ఏ సమయంలోనైనా పాడవచ్చునంటారు. మొత్తం మీద ఈ శైలిలో సమయ నిబంధన అంత కఠినంగా ఉండదు. అయితే, హిందుస్తానీ సంగీతంలో కచేరీని భైరవి రాగంతో ముగించాలనే నియమం ఉంది.
కర్ణాటక సంగీతంలో కృతులను ఎక్కువ వరకు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, స్వాతి తిరుణాల్, పట్నం సుబ్రహ్మణియ అయ్యర్ మొదలైన ఎందరో వాగ్గేయకారు లు స్వరబద్ధం చేశారు. హిందుస్తానీ శైలిలో వా గ్గేయకారులు తక్కువ. చాలా కాలం క్రితం జానపదులు పాడుకున్న గీతాలలోని ఒకటి రెండు పంక్తులను తీసుకొని – వీటిని చీజ్‌లు అంటారు – ఎవరో సంగీతకారులు బందిష్‌లను రచించారు. వారి పేర్లు మనకు తెలియవు. కానీ, ఆధునిక శకంలో సంగీతకారులు బందిష్‌లను రచిస్తున్నా రు. ఇది కర్ణాటక సంగీతంలో కూడా అరుదుగా ఉంది. గురువుల లేదా సంగీతకారుల పేర్లను పలికేటప్పుడు హిందుస్తానీ గాయకులు తమ చెవిని లేదా చెవులను చేయితో స్పర్శిస్తారు. ఈ చర్య లిప్తకాలం పాటు మాత్రమే ఉంటుంది కనుక, ఈ సంప్రదాయం గురించి ముందుగా తెలిసినవారు తప్ప ఇతరులు దీన్ని గుర్తించలేరు. ఈ ఆచారం కర్ణాటక సంగీత పద్ధతిలో లేదు.
హిందుస్తానీ సంగీతాన్ని పాడటంకన్న కర్ణాటక సంగీతాన్ని పాడటం చాలా కష్టం. ఎందుకంటే, అందులో తాళం(beat) క్లిష్టంగా ఉంటుంది. కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా పాడటం వస్తే ఏ సంగీతాన్నైనా పాడవచ్చుననే వ్యాఖ్య సబబైనదే.
– ఎలనాగ