రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలు చేపట్టిన నిరవధికంగా బంద్ మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం నుంచి నిరవధిక బంద్‌కు దిగాయి. ప్రైవేట్ యాజమాన్యాలు చేపట్టిన బంద్‌కు మద్దతుగా విద్యార్థి సంఘాలు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసే వరకూ కొనసాగించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నాయకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిరసనలో భాగంగా ఈ నెల 8న ఎల్.బి.స్టేడియంలో మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అలాగే ఈ నెల 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని ఈ బంద్‌లో పాల్గొన్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు. తొలిరోజు దాదాపు అన్ని కాలేజీలు బంద్ పాటించాయని తెలిపారు. తమకు న్యాయంగా రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా..? అంటూ ప్రైవేట్ యాజమాన్యాల ప్రతినిధులు మండిపడుతున్నారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విజిలెన్స్ విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్‌మెయిల్ చేయడమే అని పేర్కొన్నారు. నాలుగు కాలేజీలకు విడుదల చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులపైనా, అనర్హులకు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులను విజిలెన్స్ విచారణలో భాగం చేయాలని డిమాండ్ చేశారు.