మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్ర భుత్వ విధానాలు పత్తి రైతుల పాటి శాపాలుగా మారుతున్నాయని మంత్రి తుమ్మల ఆగ్రహాం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు నిబంధనలు మార్చాలని సోమవారం కేం ద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సిసిఐ చైర్మన్ లలి త్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇప్పటికే పత్తిపై ఎత్తివేసిన సుంకాల వల్ల, పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదన్నారు. సిసిఐ ద్వారా రైతులు మద్ధతు ధరకు అమ్ముకోవచ్చు అనుకుంటే కిసాన్ కపాస్ లో రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లులో ఎల్1, ఎల్2 అని విభజించి, రైతులకు సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు వస్తుందో, రాదో అన్న సంశయంలో ఉంచారని, తేమ 8 నుంచి -12 శాతం మాత్రమే అంటూ ఇష్టారీతిన నిబంధనలు పెట్టారని మండిపడ్డారు.
రైతులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి, సిసిఐ నిబంధనలన ప్రకారం కొనుగోలుకు తీసుకెళుతుంటే, ఇప్పుడు కొత్తగా ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను తెలియజేస్తుందని మంత్రి ఆరోపించారు. దేశంలో పత్తి రైతులు సుమారు కోటి మంది ఉన్నారని, రాష్ట్రంలో 44 లక్షల మంది వారి కమతాలు సగటున 1 నుండి 3 ఎకరాలు మాత్రమే అని మంత్రి తెలిపారు. ఇప్పటికే అధిక వర్షపాతం, తుపాన్ వలన పంట దెబ్బతిందని, తేమ 12 శాతం కంటే తక్కువ తీసుకురావడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారని మంత్రి వివరించారు. కేంద్ర చౌక ధరలను, సబ్సిడి దిగుమతులకు అనుమంతించడం వలన మార్కెట్లో పత్తి రేటు ఆరు వేలకు పడిపోయిందని, ఈ క్రమంలో సిసిఐ మీద భరోసా ఉంచి రైతులు పత్తిని సిసిఐకు తీసుకొస్తుంటే సిసిఐ ప్రవేశ పెట్టిన నూతన నిబంధన రాష్ట్ర పత్తి రైతులకు ఆశనిపాతం లాంటిదన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ స్ట్రాటిస్టిక్స్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో సరాసరి దిగుమతి 7 క్వింటాళ్లు ఉంటుందని, రైతు వద్ద అంతకంటే ఎక్కువ కొనమనడం ఏ మాత్రం సహేతుకం కాదని చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. తెలంగాణలో పత్తి వర్షాధారంగా చెల్క నేలల్లో ఇప్పటికీ పండిస్తూనే ఉన్నారని, ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని చెపుతున్నారని, నల్లరేగళ్లలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్న రైతులు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇటువంటి నిబంధనలతో రైతులను గోస పెట్టడం సరికాదన్నారు. కేంద్రం ఒకవైపు సుంకాలు ఎత్తివేసి, బహిరంగ మార్కెట్లో పత్తికి ధర పతనమయ్యేలా చేసిందని, ఇంకోవైపు సిసిఐ ద్వారా సవాలక్ష కొర్రీలు పెట్టిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని సిసిఐ, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేసి పాత పద్దతిలో పత్తి కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. తేమ 20 శాతం ఉన్న పత్తిని సైతం సిసిఐ అధికారులు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు దిగుమతి సుంకాలు ఎత్తివేయడంపై పునరాలోచన చేయాలని మంత్రి కోరారు.