వాషింగ్టన్ : అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణిగిన సమయంలో ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోపాటు ఆ దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో పాల్గొన్న ఆయన, ఇటీవల ఆసియా పర్యటన గురించి మాట్లాడారు.
తైవాన్‌పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే అమెరికా సైన్యం పాల్గొంటుందా ? అని ట్రంప్‌కు ప్రశ్న ఎదురైనప్పుడు..“ ఇక్కడ నేను ఎలాంటి రహస్యాలు చెప్పలేను. అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం మేం ఏమీ చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు ” అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల దక్షిణ కొరియా వేదికగా డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండుగంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వారు పలుకీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు, అరుదైన ఖనిజాల సమస్యకు పరిష్కారం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వార్నింగ్‌లు ఇవ్వడం గమనార్హం.