కాబూల్ : తరచుగా ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లే అఫ్గానిస్థాన్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది. సోమవారం తెల్లవారు జామున ఉత్తర అఫ్గానిస్థాన్‌లో 6.3 (రిక్టార్‌స్కేలు) తీవ్రతతో భూకంపం సంభవించింది. . అఫ్గాన్ పశ్చిమ నైరుతి దిశ పట్ణం ఖుల్మ్‌కు 22 కిమీ దూరంలో 28 కిమీ లోతున భూకంపం కేంద్రీకృతమైందని, అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రజారోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమన్ 20 మృతదేహాలను బల్ఖ్, సమంగాన్ ప్రావిన్సుల్లోని ఆస్పత్రులకు తీసుకురావడమైందని చెప్పారు. ఇంకా మృతదేహాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
సమీప ప్రావిన్స్‌బదక్‌షాన్‌లో కూడా పాక్షికంగా, పూర్తిగా దాదాపు 800 ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా మందికి స్వల్పగాయాలయ్యాయని, వెంటనే చికిత్స చేసి పంపడమైందని అఫ్గానిస్థాన్ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ అధికార ప్రతినిధి యూసఫ్ హమ్మద్ చెప్పారు. సహాయ, అత్యవసర బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయని, గాయపడిన వారిని తరలిస్తున్నారని, మరికొంతమందికి సాయం చేస్తున్నారని రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది. భూకంపం ప్రాణనష్టం, ఆస్తుల నష్టం కలిగించాయని తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిథి జబీహుల్లా ముజాహిద్ తన ఎక్స్‌ఖాతాలో వెల్లడించారు.
ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్‌లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. చారిత్రక బ్లూ మసీదు దెబ్బతింది. మసీదు గోడల నుంచి ఇటుకలు జారిపడ్డాయి. ఇతర ప్రావిన్స్‌ల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. తూర్పు అఫ్గానిస్థాన్‌లో కొన్ని వారాల క్రితం భూకంపం సంభవించింది. ఆగస్టు 31న తూర్పు అఫ్గనిస్థాన్‌లో పాకిస్థాన్‌సరిహద్దు సమీపాన భూకంపం సంభవించి 2200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో అక్టోబర్ 7న భూకంపం సంభవించి 4000 మంది చనిపోయారు.