బెంగళూరు: సౌతాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా-ఎ కెప్టెన్ రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 309 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో జార్డర్ 71, హంజజా 66, రుబిన్ 54, ఊరెన్ 46 పరుగుల చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 234 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్‌లో ఆయుష్ 65, బదోనీ 38, సాయి సుదర్శన్ 32 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయాడు. 20 బంతుల్లో 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
అయితే రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 274 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో పంత్ చెలరేగిపోయాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 113 బంతులు ఎదురుకొని 11 ఫోర్లు, 4 సిక్సులతో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తద్వారా సెంచరీని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం 68 ఓవర్లు ముగిసేసరికి భారత్-ఎ జట్టు 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్‌కు 29 పరుగులు అవసరం ఉంది.