మన తెలంగాణ/హైదరాబాద్ : నకిలీ మద్యం కేసులో వైసిపి నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును సిట్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేశ్ చెప్పడంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, అంతా పథకం ప్రకారమే జరిగిందని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు ఇటీవల వాంగ్మూల మిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు జోగి రమేశ్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీసుకు తరలించి విచారించారు. దాదాపు 7 గంటల పాటు జోగి రమేశ్‌ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముని వేర్వేరుగా అధికారులు విచారిం చారు. అధికారు ల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసులో ఎ18గా జోగి రమేశ్, ఎ19గా జోగి సోదరుడు జోగి రాముని అధికారులు చేర్చనున్నారు. జనార్దన్‌తో ఉన్న సంబంధాలు, ఆఫ్రికా వెళ్లే ముందు జనార్దన్ ఇంటికి వచ్చి కలిసిన భేటీపై జోగి బ్రదర్స్‌ని అధికారులు ప్రశ్నించా రు. అయితే, జోగి రాముకి, జనార్దన్‌కు మధ్య ఫైనాన్షియల్ లింకులపై వరుస ప్రశ్నలని అధికారులు సంధించారు, మాజీ మంత్రి అరెస్ట్ వైసిపిలో ప్రకంపనలు రేపుతోంది.
అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం మలుపులు చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రోద్బలం మేరకు నకిలీ మద్యం తయారు చేశానని, కేసులో ఎ1గా ఉన్న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్ధన రావు ఇదివరకే వెల్లడించాడు. ఇది రాజకీయంగా కలకలం రేపింది. తనను జోగి రమేశ్ ఏప్రిల్‌లో సంప్రదించి, జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారీ చేయాలని సూచించా రని, ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయాల్సిన యూని ట్‌ను తంబళ్లపల్లికి మార్చాలని చెప్పి నట్లు పేర్కొన్నారు. మొదట్లో రూ.3 కోట్లు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పిన జోగి రమేష్, తర్వాత తనను మధ్యలో వదిలేశారని ఆరోపించాడు.
ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకునేందుకు ఆ డబ్బు పనికొ ్తందని ఆశపెట్టడంతో మద్యం తయారు చేసినట్లు తెలిపాడు. జోగి రమేశ్ సూచనల మేరకు విషయం లీక్ చేసి దాడి జరిగేలా చేశానని వీడియోలో చెప్పడం విదితమే. కూటమి ప్రభు త్వాన్ని నకిలీ మద్యం కేసులో విమర్శల పాల య్యేలా చేయడమే దీని లక్ష్యమన్నాడు. కాగా, తనకు నకిలీ మద్యం కేసుతో ఏ సంబంధం లేదంటూ ఇటీవల విజయవాడలోని దుర్గగుడిలో మాజీ మంత్రి జోగి రమేశ్ సత్య ప్రమాణం చేశారు. తనను దెబ్బకొట్టాలంటే రాజకీయంగా దెబ్బకొట్టాలని, అంతేకానీ వ్యక్తిత్వంపై దాడి చేయడం సరి కాదని హితవు పలికారు. నకిలీ మద్యం కేసులో కావాలనే తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని, అందుకే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన కనబర్చారు. సిట్ అధికారుల రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరు ఎక్కడా లేదని, కానీ తనను కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం ఉందని నిరూపిస్తే విజయవాడ దుర్గమ్మ పాదాల వద్ద ఉరేసుకుంటానని జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్ట్ : వైఎస్ జగన్
ఈ నేపథ్యంలో జోగి రమేశ్ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు సంచలన ట్వీట్ చేశారు. ‘మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బిసి నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు ’అంటూ ఖండించారు.
ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికే అరెస్ట్..
మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేశ్ అరెస్టు పూర్తిగా అక్రమ అరెస్ట్ అని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని వైసిపి నేతలు మండిపడ్డారు.ఈ మేరకు వైసిపి నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టిజెఆర్ సుధాకర్‌బాబు ఆదివారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.