మన తెలంగాణ/హైదరాబాద్‌ః సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది చందంలా రాష్ట్ర ప్రభుత్వ పని తీరు ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్-షోలో ప్రసంగిస్తూ కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే సన్న బియ్యం వంటి పథకాలన్నీ ఆగిపోతాయని ఓటర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు.
సన్న బియ్యం పథకం రాష్ట్రానికి చెందిందే అయితే ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే ఆ పథకాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కిలో రూ. 45 అయితే, రాష్ట్ర ప్రభుత్వం కిలోకి రూ. 15 మాత్రమే వాటాగా చెల్లిస్తున్నదని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ‘ఉచిత బస్సు సౌకర్యం’ మినహా ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌కు ఓట్లు వేయకపోతే అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని ఓటర్లను బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని బిజెపి తరఫున ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి ఇంకా కాంగ్రెస్ నాయకులు బిజెపిని విమర్శించడం ద్వారా మజ్లీస్ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.