మనతెలంగాణ/హైదరాబాద్ : డిసెంబర్ 9లోపు డి.ఎ.బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లించనట్లయితే పిఆర్‌టియుటిఎస్ ఉద్యమకార్యాచరణ చేపడుతుందని ఉపాధ్యాయ ఎంఎల్‌సి పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పిఆర్‌టియుటిఎస్ 36వ సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షత జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎల్‌సి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జె.ఎ.సి.తో జరిగిన ఒప్పందం ప్రకారం ఇ.హెచ్.యస్‌పై నెలలోపు ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు. గురుకుల పాఠశాలల టైం టేబుల్ మార్పు చేయడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించం, కె.జి.బి.వి, ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పేర్కొన్నారు.
మేనిఫెస్టోలో తెలిపిన విధంగా సి.పి.ఎస్. రద్దు, 2003 డి.యస్.సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ ప్రధాన కార్యదర్శి నివేదికను సమర్పించారు.ఈ సమావేశంలో మాజీ ఎంఎల్‌సి బి. మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు పేరి వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, వంగ మహేందర్ రెడ్డి, 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, 1500 మంది పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.