జైపూర్ : రాజస్థాన్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది భక్తులు దుర్మరణం చెందారు. ముగ్గురు గాయపడ్డారు. జైపూర్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని ఫలోడి జిల్లాలో ఈ ఘటన జరిగింది. యాత్రికులతో వెళ్లుతున్న టెంపో ట్రావెలర్ బస్సు వేగంగా వెళ్లి నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రాలర్‌ను ఢీకొని చొచ్చుకుని వెళ్లిందని అధికారులు తెలిపారు.
భారత్ మాలా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. బికనీర్‌లోని కొల్యాత్ ఆలయ సందర్శన తరువాత భక్తులు సురసాగర్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వివరాలను స్థానిక ఎస్‌పి కుందన్ కన్వారియా మీడియాకు తెలిపారు. బాధితులు ఫలోడి ప్రాంతీయులే అని వెల్లడైంది. ఈ దుర్ఘటన గురించి తెలియగానే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ స్పందించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని, ఉన్నతాధికారుల బృందం అక్కడికి వెళ్లుతుందని తెలిపారు.