జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ముంబైకి తరలించారు. శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు వచ్చింది. జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం 6 ఇ 68 లో మానవ బాంబు ఉందని , 1984లో మద్రాస్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడి తరహాలో ఈ దాడి జరుగుతుందని బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ విమానాన్ని ముంబై విమానాశ్రయానికి తరలించారు. భద్రతా పరమైన తనిఖీలు నిర్వహించిన తరువాత విమానాన్ని పంపించారు. దీంతో హైదరాబాద్‌కు శనివారం ఉదయం 9.10 గంటలకు రావలసిన విమానం సాయంత్రం 4 గంటల తరువాత చేరుకుంది. 1984 లో మద్రాస్ ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదుల బాంబు దాడికి విమానం పేలిపోయి 33 మంది చనిపోయారు. ఆ దుర్ఘటన పేరు చెప్పి ఇప్పుడు బెదిరింపు రావడం గమనార్హం.