హత్యకు గురి కావడానికి సరిగ్గా మూడు రోజుల ముందు.. అంటే 1948 జనవరి 27వ తేదీన మహాత్మాగాంధీ ప్రస్తుతం ఉన్న స్వరూపంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయింది అంటూ, దానిని రద్దుచేసి ఆ స్థానంలో ‘లోక్ సేవక్ సంఘ్’ పేరుతో జనంలోకి వెళ్లాలని చిన్న నోటు రాశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఆ అభిప్రాయం వెలిబుచ్చిన మూడు రోజులకే హత్యకు గురై ఉండకపోతే పట్టుబట్టి కాంగ్రెస్‌ను రద్దు చేయించి ఉండేవారా? నిజంగానే అదే జరిగి ఉంటే భారతదేశ రాజకీయాలు ఎంత నిస్తేజంగా, చప్పగా ఉండేవో ఊహించడం కష్టమే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గొప్ప లక్షణమే అది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యి, కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సన్నిహితులు కొందరు వైయస్సార్ ఆత్మ అయిన కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ గ్యారెంటీ అని ఊహాగానాలు చేస్తుంటే, ఆయనను అభినందిస్తుంటే కెవిపి ఒక మాట అన్నారు.. కాంగ్రెస్‌తో గేమ్స్ ఆడొద్దు అని ఖాన్ తో గేమ్స్ ఆడోద్దన్న ఒక సినిమా డైలాగ్‌ని గుర్తు చేస్తూ. ఆయన అన్నట్టుగానే అప్పుడు రాజ్యసభ సభ్యత్వం రాలేదు. కొద్దికాలం తర్వాత ఆయన రాజ్యసభకు వెళ్లారు.
కాంగ్రెస్ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరు చెప్పలేరు. అది ఊహాతీతమైన రాజకీయపక్షమని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న తరుణంలో కూడా కాంగ్రెస్ వ్యవహార శైలి కెవిపి అన్నట్టు కాంగ్రెస్ తో గేమ్స్ ఆడొద్దు అన్నట్టుగానే ఉంది. కొంతకాలంగా తెలంగాణలో రెండు శాసనమండలి పదవుల విషయంలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్ ను, ఒక ఉర్దూ పత్రిక సంపాదకుడు ఆమెర్ అలిఖాన్‌ను శాసనమండలి సభ్యులుగా గవర్నర్ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేస్తే దానికి సుప్రీంకోర్టు అడ్డుపడటం, ఆ తర్వాత మళ్లీ మంత్రిమండలి కోదండరామ్ తోపాటు, ఆమేర్ అలీని తొలగించి, మహమ్మద్ అజరుద్దీన్‌ను ప్రతిపాదించి గవర్నర్‌కు పంపింది. ఇప్పటికింకా గవర్నర్ ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముంచుకొచ్చి అక్కడ ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా 2023లో పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీన్‌ను మంత్రిగా నియమించింది. ఆయన శాసనమండలి సభ్యత్వం ఇంకా ఖరారు కావలసి ఉంది.
అయితే ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చేర్చుకునే పూర్తి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఆ పదవి చేపట్టిన ఆరు మాసాలలో శాసనసభ లేదా శాసనమండలి నుండి సభ్యుడిగా ఎన్నికయి రావలసి ఉంటుంది. అలా జరగకపోతే గతంలో ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ పరిస్థితి అజహర్‌కు ఎదురుకాకతప్పదు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా దింపేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని తనవైపు తిప్పుకునే క్రమంలో హరికృష్ణను, ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా, మంత్రిగా నియమించి రవాణాశాఖ అప్పగించారు. ఆరుమాసాలు తిరగకుండానే ఎన్టీఆర్ మరణించడంతో ఇక తనకు హరికృష్ణ అవసరం లేదనుకున్నారేమో చంద్రబాబు ఆయనను చట్టసభకు పంపించే ఆలోచనకు సున్నాచుట్టారు. దాంతో హరికృష్ణ మంత్రిపదవి ఊడింది. అటువంటి పరిస్థితి అజహరుద్దీన్‌కు రాకూడదనుకుంటే ఆయన ఆరు మాసాల్లోపు తప్పనిసరిగా శాసనమండలి సభ్యుడు అయ్యేట్టు చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే.
ఆరు మాసాల్లో ఆయన శాసనసభకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఆయనను శాసనసభకు పంపించే ఆలోచన కాంగ్రెస్‌కు ఉన్నట్టయితే గత ఎన్నికల్లో అదే నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశాడు కాబట్టి అజహర్ కే ప్రస్తుత ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ స్థానంలో పార్టీ టికెట్ ఇచ్చి ఉండేది. వచ్చే ఆరు మాసాల్లో ఆయన మరే నియోజకవర్గంనుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం లేదు.ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో ప్రతి నాయకుడు తాను ఎందుకు మంత్రి కాకూడదు, ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు ఎన్నడూ కొరతలేదు. అయితే ఈ వారంలో అజహరుద్దీన్ ఒక్కడితో మంత్రివర్గ విస్తరణ చేసి, అదే రోజు మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఒకరిని సలహాదారుగా, మరొకరిని కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడాన్ని చూస్తే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని అర్థమవుతున్నది. ఇందులో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత చూసుకునే సలహాదారు పదవికి అత్యంత సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శనరెడ్డికి కేబినెట్ సమావేశాలకు కూడా హాజరయ్యే వీలు కల్పించడం విశేషం.
ఇద్దరికీ కేబినెట్ హోదా కల్పించడం మంత్రివర్గ విస్తరణ విషయంలో స్పష్టత వచ్చిందనే సంకేతాలను వెలువరించినా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం విషయంలో ప్రత్యర్థి పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం కాంగ్రెస్ ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నదని విమర్శ చేయడానికి ఆస్కారం కలిగింది. అజహరుద్దీన్ అసలు సిసలు హైదరాబాదీ. నారాయణగూడలోని విఠల్వాడి వాస్తవ్యుడు. ఆల్ సెయింట్స్ స్కూల్లో క్రికెట్ ఆట మొదలుపెట్టి భారత క్రికెట్ జట్టుకే కెప్టెన్ గా ఎదిగి రెండుసార్లు తన కెప్టెన్సీలో ఆసియా కప్ సాధించి, 1996 ప్రపంచ కప్ పోటీల్లో జట్టును సెమీఫైనల్స్ వరకు నడిపించిన అద్భుత క్రీడాకారుడు. క్రీడారంగంలో అత్యున్నత ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ కూడా. అనేక ఎత్తుపల్లాలు చూసినవాడు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలకు శ్రీకారం చుట్టి అదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ప్రఖ్యాతి చెందిన అజహరుద్దీన్, మూడుసార్లు ప్రపంచకప్ పోటీలకు భారతజట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అజహరుద్దీన్ 2012లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని భారత క్రికెట్ సంఘం బిసిసిఐ విధించిన జీవితకాలపు నిషేధానికి గురయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ నిషేధాన్ని తర్వాత తొలగించింది. ఒకసారి ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవిలో కూడా కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో తలమునకలై ఉన్న రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి వర్గం అప్పట్లో హెచ్ సిఎ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు చేసినవారే. ఇప్పుడు ఆ ఇద్దరూ మంత్రివర్గ సహచరులు. ఇక అజహరుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం కోసమే మంత్రివర్గంలోకి తీసుకున్నారని ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తున్నాయి.
జూబ్లీహిల్స్‌లో ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం అజహరుద్దీన్ కూడా ప్రయత్నించినట్టు వార్తలు చదివాం. 2023లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు అప్పట్లో మజిలీస్ సహకారంతో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌కు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. అప్పట్లో అజహరుద్దీన్‌కు మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థిని సమర్థించిన మజిలీస్ పార్టీ, ఈసారి తన అభ్యర్థిని పోటీకి నిలపకుండా నామినేషన్ సమయంలో కాకతాళీయంగా కనిపించే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను మజిలీస్ అగ్ర నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పనిసరిగా కాంగ్రెస్‌కు అనుకూల సంకేతాలనే పంపుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో కలిపి దాదాపు 1,20,000 ఓట్లు ముస్లిం మైనారిటీలవి ఉండటం గమనార్హం. ఫలితంపై ప్రభావం చూపగల సంఖ్యలో వారు ఉన్నారన్నది నిర్వివాదాంశం.
ఈ ఉపఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం. మామూలుగా ఉప ఎన్నికలను అధికారపక్షం అంత సీరియస్‌గా పట్టించుకోదు. అయితే ఇక్కడ రెండు ప్రతిపక్షాలు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు మేలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రుజువు చేసేందుకు తాము గెలిచినా ఓడినా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అందుకే కాంగ్రెస్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కాబట్టే ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలోకి దిగారు. తన సొంత స్థానం కాబట్టి మళ్లీ గెలుచుకోవాలనే పట్టుదలతో బిఆర్‌ఎస్ ఉంటే, భారతీయ జనతా పార్టీకి అందులోనూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇది అత్యంత ప్రధానమైన పోటీగా పరిణమించింది. అందుకు కారణం పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింట మెజారిటీ సాధించి గెలిచిన కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్, నాంపల్లి సెగ్మెంట్లలో మాత్రం వెనుకబడటంతో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించింది. 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో కాంగ్రెస్‌కు 64,212 ఓట్లు వస్తే, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు అదే స్థానంలో 89,705 ఓట్లు లభించాయి. దాదాపు 25 వేల ఓట్లు కాంగ్రెస్‌కు పెరిగాయి.
2023లో 80,000కు పైగా ఓట్లు సాధించి గెలిచిన బిఆర్‌ఎస్, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి 18 వేల ఓట్లకు పడిపోయింది. ఆ మేరకు బిజెపి లాభపడి దాదాపు 40 వేల ఓట్లు శాసనసభ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో పెంచుకున్నది. అయినా కాంగ్రెస్ కంటే తక్కువలోనే ఉన్న కారణంగా ఇది కిషన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు మహాబద్దకస్థులు. ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో ఓటర్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కానీ ఓటింగ్ శాతం మాత్రం తక్కువగానే ఉంటుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో 47.58% ఓట్లు పోలైతే సరిగా ఒక ఏడాదికి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 45.38 శాతానికి తగ్గింది. ఈసారైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే నాయకుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మరో ముచ్చట.. పక్క రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యపక్షాలైన టిడిపి, జనసేన పార్టీలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ బరిలో ఉన్న తమ సహచర పార్టీ బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఇప్పటివరకు నోరు మెదపలేదు. బిజెపి కూడా నోరు తెరిచి ఆ పార్టీ నేతల మద్దతు ఇంతవరకు కోరలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారని బిజెపి వర్గాల్లో ప్రచారం మాత్రం జరుగుతున్నది. మరోపక్క భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచే మంత్రాంగం నడుపుతున్నారు తప్ప ప్రచారానికి వస్తున్న జాడలేదు. ఇది జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక తాజా స్థితి.
