అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భారీగా భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. కొందరు భక్తులు స్పృహతప్పిపడిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సిఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనలో భక్తులు చనిపోవడం అనేది అత్యంత విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులతో స్థానిక ప్రతినిధులకు బాబు సూచించారు.