హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ మాటకారితనంతో తుపాకీ వెంకట్రావులా మభ్యపెడతారని చురకలంటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రబెల్లి డోర్ టూ డోర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా రేవంత్ మూర్ఖపు మాటలు మానుకోవాలని, మోసపూరిత మాటలతోనే కాంగ్రెస్ సర్కార్ వచ్చిందని విమర్శలు చేశారు. బిజెపితో రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని, రేవంత్, మంత్రుల అవినీతిపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని, హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసేవారు నిండా మునిగారని ఎర్రబెల్లి దుయ్యబట్టారు.
రేవంత్ వల్ల హైదరాబాద్ మొత్తం కుప్పకూలిపోయిందని, రైతుల వడ్లకు కాంటాలు, బస్తాలు ఇవ్వడంలేదని, రేవంత్ వల్లే ధాన్యంతడిసిపోయిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుందని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటును బిఆర్ఎస్ పార్టీకి వేయించాలంటూ మనందరం కలిసికట్టుగా కష్టపడదామని బిఆర్ఎస్ శ్రేణులకు ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ప్రజలు కూడా ఈసారి మాగంటి సునీతనే గెలిపిస్తామని, బిఆర్ఎస్ జెండా ఎగరేస్తాము అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, నీటి కొరత వచ్చిందని ధ్వజమెత్తారు. నాయి బ్రాహ్మణులకు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయం చేశారని, కానీ వారిని సర్వనాశనం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని ఎర్రబెల్లి విమర్శించారు.