ప్రపంచ చరిత్రను తిప్పిచూసినా, యుద్ధాల జాడ కనిపిస్తుంది. కాలం మారినా, మనిషి ఆలోచన మారినా యుద్ధం అనే ఆతురత మాత్రం మానవ స్వభావంలో ఏదో మూలన దాగి ఉంది. కొన్నిసార్లు అది అహంకారంగా పుట్టుతుంది. కొన్నిసార్లు భయంగా, మరికొన్నిసార్లు ఆత్మరక్షణ అనే పేరుతో రూపం దాలుస్తుంది. దేశాల మధ్య యుద్ధాలకు ప్రధాన కారణం అధికారం మీద ఆకాంక్ష. ఒక దేశం తన ప్రభావాన్ని మరొక దేశంపై చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. సరిహద్దులు విస్తరించాలనే ఆశ, ఆర్థిక వనరులపై ఆధిపత్యం సాధించాలనే తపన, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతాలపై కన్నేయడం ఇవన్నీ యుద్ధాలకు విత్తనాలు వేస్తాయి. ఒక దేశం ప్రజాస్వామ్య మార్గంలో నడుస్తే, ఇంకో దేశం నియంతృత్వం దిశగా సాగుతుంది. ఆ విలువల మధ్య ఉన్న భిన్నతే కొన్ని సందర్భాల్లో సాయుధ ఘర్షణలకు దారితీస్తుంది. అయితే ఇవి కేవలం సిద్ధాంతాల మధ్య పోరాటం కాదు వాటి వెనుక మనుషుల భావాలు, ఆశలు, భయాలు కూడా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా యుద్ధాలను ప్రేరేపిస్తాయి. చమురు, బంగారం, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరులు ఉన్న ప్రాంతాలు ఎప్పుడూ ఆర్థిక స్పర్ధకు వేదిక అవుతాయి.
ఎవరైతే ఆ వనరులను నియంత్రిస్తారో, వారే ప్రపంచానికి నియంత్రణ కలిగి ఉంటారనే భావనతో దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబడతాయి. కానీ ప్రతి యుద్ధం వెనుక ఒక మానవ కథ ఉంటుంది. ఒక సైనికుడి కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక చిన్నారి భయం – ఇవే నిజమైన యుద్ధ దృశ్యాలు. గెలిచిన దేశమూ, ఓడిన దేశమూ చివరికి గాయాలతోనే మిగిలిపోతాయి. యుద్ధం ఎవరినీ సంతోషపెట్టదు; అది కేవలం నష్టాల పునాదిపై నిర్మితమైన విజయాన్ని మాత్రమే అందిస్తుంది. నేటి ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, యుద్ధాల రూపంమారినా వాటి మూలస్వభావం మాత్రం మారలేదు. ఇప్పుడు బాంబులు, కత్తులు కాకుండా సాంకేతిక ఆయుధాలు, సైబర్ దాడులు, ఆర్థిక ఆంక్షలు యుద్ధ రూపాలు అవుతున్నాయి. కానీ అసలు తాత్పర్యం ఒకటే ఎవరో ఒకరు గెలవాలనే మనస్తత్వం. ఇలాంటి సమయాల్లో మానవ విలువలే అసలైన ఆయుధం కావాలి. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహన – ఇవే దేశాల మధ్య శాంతి దారులు. యుద్ధం అనేది ధైర్యానికి కాదు, సహనానికి పరీక్ష. ఎవరు శాంతిని కాపాడగలరో, వారు నిజమైన వీరులు. ప్రపంచం మొత్తానికీ ఈ సత్యం ఒక జ్ఞాపకం కావాలి.
యుద్ధం ఎవరికీ లాభం కాదు; ప్రేమ, నమ్మకం, సంభాషణ – ఇవే శాశ్వత విజయ మార్గాలు. మానవతనే యుద్ధం మీద గెలిచే ఏకైక శక్తి. గత నూరేళ్ల యుద్ధగాథలు – ప్రపంచానికి ఒక నేర్చుకోదగిన పాఠం ప్రపంచ చరిత్రలో గత నూరేళ్ల కాలం అత్యంత మార్పులు, పరీక్షలు, మానవతకు గాఢమైన పాఠాలు నేర్పిన కాలంగా నిలిచింది. ఈ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాలతో మొదలై, శాంతి ప్రయత్నాలతో ముగిసిన అనుభవాల సమాహారం. యుద్ధం అనే పదం కేవలం పోరాటాన్ని మాత్రమే కాదు, మానవ మనసులోని ఆశలు, భయాలు, ఆధిపత్యం, రక్షణల మధ్య నడిచే సంఘర్షణను సూచిస్తుంది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నుంచే ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఎదుగుతున్న సమయంలో, 1914లో యూరప్ దిశగా ఒక పెద్ద మంట మొదలైంది. ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో మొదలైన ఈ ఘర్షణ, క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టుకుంది. ఆ యుద్ధంలో యూరప్ దాదాపు మొత్తం కుదేలైంది. కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. శాంతి కోసం ఏర్పడిన ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ తర్వాతి కాలంలో ప్రపంచ సహకారానికి పునాదిగా మారింది.
మొదటి యుద్ధం ముగిసి ఇరవై ఏళ్లలోపే, ప్రపంచం మరలా ఆగ్రహాగ్నిలో చిక్కుకుంది. జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల విస్తరణ వాంఛ, మరోసారి ప్రపంచాన్ని అగ్నిగుండం చేసింది. అణుబాంబులు, ట్యాంకులు, గగనయానాలు – మానవ విజ్ఞానానికి నొప్పి కలిగించే పరికరాలుగా మారాయి. చివరికి యుద్ధం ముగిసింది. కానీ ప్రపంచం రెండు శక్తులుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ దేశాలు, మరొకటి తూర్పు బ్లాక్. ఇదే కాలం లో ఐక్యరాజ్యసమితి పుట్టింది – శాంతికి పునాది వేసిన ప్రపంచ వేదికగా. 1945 తర్వాత ప్రపంచం నేరుగా యుద్ధం చేయకపోయినా, ఆలోచనల యుద్ధం కొనసాగింది. అమెరికా, సోవియట్ రష్యా మధ్య నడిచిన ప్రచ్ఛన్నయుద్ధం అనేది ఆయుధాల పోటీగా, అంతరిక్ష పోటీగా, ఆర్థిక ఆధిపత్య పోటీగా మారింది. ప్రపంచ దేశాలు ఈ రెండు శక్తుల మధ్య సంతులనం పాటించే ప్రయత్నం చేశాయి. 1950 1975 మధ్య కాలం వరకు కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి ఘర్షణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇవి కేవలం ప్రాంతీయ సరిహద్దుల పోరాటం మాత్రమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవం, స్వాతంత్య్రం కోసం జరిగిన త్యాగాల పాఠాలుగా నిలిచాయి.
మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాలు- సూయెజ్, ఇరాన్, ఇరాక్, గల్ఫ్ వంటి ఘర్షణలు చమురు ఆధారిత ఆర్థికత, భూభాగ ప్రాధాన్యం కారణంగా చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నగరాలు శిథిలమయ్యాయి, వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కానీ ఆ దేశ ప్రజల ధైర్యం, దేశభక్తి ప్రపంచానికి స్ఫూర్తి ఇచ్చింది. శాంతి కోసం వారి ప్రయత్నం మానవ విలువల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచం నేడు కూడా యుద్ధాల భయంతో పూర్తిగా విముక్తి పొందలేదు. సాంకేతిక శతాబ్దంలోనూ యుద్ధాలు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. సరిహద్దుల వద్ద తుపాకీ శబ్దాలే కాకుండా, ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులు, సమాచార మాయాజాలాలు, వ్యూహాత్మక ప్రభావ పోటీలు కూడా యుద్ధాలే అయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇంకా ఘర్షణలు ఆగలేదు; యూరప్ తూర్పు అంచుల్లో ఉక్రెయిన్ యుద్ధం నేటి మానవతకు సవాలు విసురుతోంది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనూ అంతర్గత ఘర్షణలు ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయి. శాంతి ఒప్పందాలు కుదురుతున్నా, అవిశ్వాసపు గోడలు మాత్రం ఇంకా కూలలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పుడు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉంది. యుద్ధం ఎవరికీ పరిష్కారం కాదు, శాంతి మాత్రమే మానవతకు ఆశ్రయం. ఆగ్నేయ, తూర్పు, పశ్చిమ ఏదైనా కావచ్చు, చివరికి ప్రతి మానవ హృదయంలో శాంతి అగ్ని వెలిగితేనే ఈ ప్రపంచం నిజమైన విజయం పొందుతుంది.
– చిటికెన కిరణ్ కుమార్ 94908 41284