మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : మొంథా తుఫాన్ కారణంగా సంభవించిన వరదల్లో మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల తో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై శుక్రవా రం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో12 జిల్లాల్లో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సానికి రాష్ట్రవ్యాప్తంగా పంటలు గ్రామాలు, పట్టణాలు తీ వ్రంగా నష్ట పోయాయని చెప్పారు. వరంగల్ నగరంలోని వరద బాధితులకు ఇంటికి రూ.15 వేలు ఇస్తామని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ స్పెషల్ కోటలో ఇంటి పట్టాలు
ఇస్తామని అన్నారు. గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని, ఇసుక మేటల తొలగింపునకు ఎకరాకు ఎన్‌ఆర్‌జిఎస్ కింద రూ.లక్ష కింద సాయం అందజేస్తామని వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన వరంగల్ ను త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం సిఎం, తన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం హనుమకొండ=వరంగల్ జిల్లాల కేంద్రాల్లోని వరద ముంపునకు గురైన పోతననగర్, సమ్మయ్యనగర్ బాధితులను స్వయంగా కలుసుకున్నారు. వారి ఇళ్లలోకి పోయి వారితో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం అండగా ఉందంటూ బాధితులను ఓదార్చారు. అక్కడి నుండి హన్మకొండ నహీంనగర్ బ్రిడ్జిని సందర్శించి నాలాను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి బృందం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా జరిగిన నష్టంపై అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సమీక్షలు చేసి అన్ని శాఖల అధికారులు కలెక్టర్లు సమన్వయంతో క్షేత్ర స్థాయి పర్యటన చేసి నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆ నివేదికలను కేంద్రానికి పంపించాలని వచ్చిన నష్టంపై కేంద్రం నిధులు కేటాయించి ఆదుకోకపోతే ఊరుకునేది లేదని అన్నారు. వరదలతో దెబ్బతిన్న వరంగల్ జిల్లాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్మార్ట్ నిధులతోపాటు ఇతర అభివృద్ధి నిధులతో వరంగల్ మహానగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. చెరువులు, కుంటలు వరంగల్ నగరం చుట్టూ ఎన్ని ఉన్నాయి? వాటిని పరిశీలించి పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో క్లౌడ్బరెస్ట్ వర్షాలు నిత్యం ఉంటాయని వాటికి అనుగుణంగా శాశ్వత నిర్మాణాలు ఉండాలన్నారు. పట్టణంలో చెరువు శిఖాల్లో కబ్జాలు ఉంటే వాటిపై ఉక్కు పాదం మోపాలన్నారు.
పది మంది కోసం పదివేల మందిని ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదన్నారు. వరంగల్, హనుమకొండ పట్టణాల్లోని అమరావతి నగర్, సమ్మయ్యనగర్, టివి నగర్ పోతన నగర్, రంగంపేట తదితర కాలనీలన్నీ వరదలతో ముంచెత్తినందున ఆ బాధితులందరినీ గుర్తించి వారికి నష్టపరిహారం అందించాలన్నారు. ఒక్కొక్క ఇంట్లో లెక్కలేనంత నష్టం జరిగిందన్నారు. టివిలు, ఇతర విలువైన వస్తువులు ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం దేనికి సరిపోదని, వారిని తక్షణ సహాయంగా ఆదుకోవడానికి నిధులను అందిస్తామని అన్నారు. వరదల్లో మృతి చెందిన పశువులకు రూ.50 వేల చొప్పున నష్టం అందించాలని అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలన్నారు. వరద ప్రాంతాల్లో ఉన్న గుడిసె రేకుల షెడ్డు బాధితులకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మంజూరు చేయాలన్నారు. చెరువు శిఖం భూములను ఎవరు ఆక్రమించినా సహించేది లేదన్నారు. శిఖం భూముల్లో గుడిసెలు వేసిన వారికి పట్టాలు గానీ ఇండ్ల మంజూరు ఇచ్చేది లేదన్నారు. నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసె వేసుకున్న వారికి పట్టాలు ఉంటే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు లేనివారికి వర్తించదని అన్నారు. వరంగల్ మహానగరం వరద ముంపు నుండి ఇంకా కోలుకోలేదని, తక్షణమే అధికారులు గ్రౌండ్ లెవెల్ లో కోఆర్డినేషన్‌తో పనిచేయాలన్నారు.
మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి అన్ని శాఖలు సమన్వయంతో పారిశుద్ధ పనులను ముమ్మరం చేస్తూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. తక్షణమే కాలనీలన్నీ శుభ్రం చేసి ప్రజలకు అండగా నిలవాలన్నారు. దెబ్బతిన్న రోడ్లపై తక్షణమే నివేదికలు తయారుచేసి అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేసి రోడ్లను పునరుద్ధరించాలన్నారు. వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే నిధులు మంజూరు చేశామని, ఆ పనులతోనే వరద ముంపు నష్టం జరిగిన పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్ పథకం నిధులతో చేపట్టిన పనులు ఆ నిధులు ఉన్నంతవరకే పనులు చేసే వాటిని అక్కడే వదిలేశారని అన్నారు అలాంటి పనులను ప్రత్యేక అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతో ప్రణాళిక ప్రకారం వాటిని పూర్తి చేయాలన్నారు. వరద పనుల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను జోడించి ట్రై సిటీని ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేయాలన్నారు.
ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో ఎవరు అలసత్వం వహించిన ఇకపై తక్షణ చర్యలు ఉంటాయన్నారు. భారీ వర్షాల్లో బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నానని, పనిచేస్తున్న అధికారులు కూడా గుర్తించి అందరికీ సరైన గౌరవాన్ని ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, ఎంపిలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎంఎల్‌ఎలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు రేవుూరి, ప్రకాశ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు పాల్గొన్నారు.
సిఎం పర్యటనలో భారీ బందోబస్తు..
వరంగల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరద మంపు ప్రాంతాల్లో పర్యటించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు అసాధారణ బందోబస్తును కల్పించారు. కమాండోస్‌తో పాటు సివిల్ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్న సమయంలో పోలీసులు వారి పరిధిలోని అంశాలను అమలు చేశారు. ముందుగా సూచించిన ప్రకారంగానే వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రిని పర్యటించి, కొంతమంది ప్రజలతో మాట్లాడించారు. అక్కడే ఉన్న దెబ్బతిన్న ఇళ్లను కూడా పోలీసులు ముందుగా తనిఖీ చేసి నష్టపోయిన ఇండ్లను ముఖ్యమంత్రి స్వయంగా లోనికి వెళ్లి పరిశీలించారు అక్కడ పరిమిత సంఖ్యలో బాధితులతో మాట్లాడేవారు
సర్వం కోల్పోయిన విధానాన్ని స్వయంగా చూసి చలించిపోయారు. రెండు కాలనీలో ప్రజలు ఆర్థికంగా ఆస్తి పరంగా నష్టపోవడం కాకుండా వరదల్లో మృతి చెందిన వారి బాధలు కూడా విని చలించారు. వరదలపై ఛాయాచిత్రాన్ని పరిశీలించిన సిఎం ..వరంగల్‌లో వరదలు ముంచెత్తిన దృశ్యాలను ఫొటోలను సేకరించిన అధికారులు హనుమకొండ కలెక్టరేట్లో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతాలను ప్రజలను కలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించడానికి ముందు ఏర్పాటుచేసిన ఛాయా చిత్రాలను సమీక్షించారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద వరదలు తలెత్తిన విధానం, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.