వెల్లింగ్టన్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ని న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. వెల్లంగ్టన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కివీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో ఓవర్టన్ 68, బట్లర్ 38, కార్స్ 36 పరుగులతో రాణించారు. కివీస్ బౌలింగ్‌లో టిక్నర్ 4, డఫీ మూడు, జకారీ ఫౌల్క్స్ రెండు వికెట్లు పడగొట్టారు.
అయితే లక్ష్య చేధనలో న్యూజిలాండ్ కూడా తడబడింది. ఓపెనర్లు రచిన్ రవీంద్ర (46), డెవాన్ కాన్వే (34) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి జట్టు శుభారంభం అందించారు. దీంతో కివీస్ సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. కానీ.. న్యూజిలాండ్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతూ వచ్చింది. 118 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివర్లో ఫౌల్క్స్ (14), టిక్నర్ (18) నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసి విజయం సాధించింది. 42 ఏళ్లలో న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ను వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేయడం ఇదే తొలిసారి.