చైనా షింజౌ 21 వ్యోమనౌక శుక్రవారం ( అక్టోబర్ 31) విజయవంతంగా ప్రయోగించింది. ఇది చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాగ్‌కు అనుసంధానమైందని చైనా శనివారం ప్రకటించింది. ఈ అనుసంధాన ప్రక్రియ రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా మొత్తం 3.5 గంటల్లో పూర్తయింది. గత ప్రయోగాల కన్నా మూడుగంటలు తక్కువ సమయం లోనే ఇది కావడం విశేషం. వాయువ్య చైనా లోని జియూక్వాన్ ప్రయోగ కేంద్రం నుంచి స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11.44 గంటల సమయంలో ఈ వ్యోమనౌకను ప్రయోగించారు. పైలట్, మిషన్ కమాండర్ ఝాంగ్ లు, వు ఫెయి (32) , ఝాంగ్ హోంగ్‌ఝాంగ్ అనే ముగ్గురు వ్యోమగాములు ఈ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. వీరిలో ఝాంగ్ లు గతంలో కూడా షింజౌ 15 వ్యోమనౌక ప్రయోగంలోనూ పాలుపంచుకున్నారు. మిగతా ఇద్దరు వ్యోమగాములు కొత్త వారు.
మొట్టమొదటిసారి అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. వీరిలో వు ఫెయి ఇంజినీరే కాకుండా దేశంలోనే అత్యంత యువ వ్యోమగామి. మరో వ్యోమగామి ఝాంగ్ హోంగ్‌ఝాంగ్ పేలోడ్ స్పెషలిస్టు. వ్యోమగామిగా తయారు కాకముందు కొత్తశక్తి, కొత్త వస్తువులపై ప్రయోగాలు చేసిన పరిశోధకుడు. ఇందులో ముగ్గురు వ్యోమగాములు ఉన్నారు.వీరు ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి ప్రయోగాలు చేస్తారు. వ్యోమగాములతోపాలు మొట్టమొదటిసారి నాలుగు ఎలుకలను చైనా అంతరిక్ష కేంద్రానికి పంపడం ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో రెండు ఆడ, రెండు మగ. అంతరిక్ష వాతావరణ ప్రభావం వీటిపై ఏ విధంగా పనిచేస్తుందో వ్యోమగాములు పరిశీలిస్తారు. బరువు లేక పోవడం, నిర్బంధం పరిస్థితులపై వాటి ప్రవర్తన ఎలా ఉంటుందో అధ్యయనం చేస్తారని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇంజినీర్ హాన్ పెయి వెల్లడించారు.
అంతరిక్షంలో చిన్న క్షీరదాల పెంపకం, పర్యవేక్షణకు సంబంధించిన కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎలుకల అత్యవసర స్పందనలు, అంతరిక్ష పర్యావరణానికి తగినట్టు మార్పులను అనుసరించడం ఇవన్నీ అధ్యయనం చేస్తారని హాన్ పెయి వెల్లడించారు. మొత్తం 300 ఎలుకలను శిక్షణకు తీసుకుని 60 రోజుల పాటు కఠినమైన శిక్షణ తరువాత ఈ నాలుగు ఎలుకలను ఎంపిక చేశారు. అంతరిక్ష కేంద్రంలో ఇవి ఐదు నుంచి ఏడు రోజుల పాటు ఉండవచ్చని ఆ తరువాత షింజౌ 20 వ్యోమనౌక ద్వారా భూమికి తిరిగి రావచ్చని చైనా అధికార జిన్‌హువా వార్తా ఏజెన్సీ అంచనాగా చెప్పింది. ముగ్గురు వ్యోమగాములు బయోటెక్నాలజీ, ఎయిరోస్పేస్ మెడిసిన్, మెటీరియల్స్ సైన్స్, తదితర అంశాలపై 27 సైంటిఫిక్, అప్లయిడ్‌ప్రాజెక్టులపై ప్రయోగాలు చేయాలని ప్లాను చేసినట్టు వివరించారు.చైనా అంతరిక్ష ప్రయోగాలు దేశానికి గర్వకారణమని, దేశ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఇవి సంకేతాలని 2030 నాటికి చంద్రునిపైకి మానవుడిని పంపాలన్నదే తమ లక్షమని చైనా మానవ సహిత అంతరిక్ష సంస్థ అధికార ప్రతినిధి ఝాంగ్ జింగ్‌బో వెల్లడించారు.