ముఖ్యమంత్రి ప్రజావాణి చొరవతో బాలిక సౌమ్యకు పునర్జన్మ లభించింది. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బ తిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న సౌమ్యకు సిఎం ప్రజావాణి కొండంత అండగా నిలిచి ఆ బాలిక చికిత్సకు అవసరమైన రూ. 9 లక్షలు ఆర్థిక సాయం సమకూర్చి ఆ బాలిక నిండు ఆరోగ్యంతో ఉండేందుకు సహకారాన్ని అందించింది. శుక్రవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన సిఎం ప్రజావాణికి సౌమ్య తన తండ్రి తల్లిదండ్రులతో కలిసి వచ్చి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు ధన్యవాదాలు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చల్లని దీవెనలు తన ఆయుష్షును పెంచిందని సౌమ్య సంతోషాన్ని వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా సీఎం ప్రజావాణిలో సౌమ్యకు రూ. 4 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కును చిన్నారెడ్డి, దివ్య అందించారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టి ( సెర్ప్ ) నుంచి మరో రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సౌమ్యకు అందించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఆసుపత్రిలో శస్త్రచికిత్స విజయవంతమైంది. జనగాం జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన ఈర్ల శ్రీనివాస్, అనురాధ తమ కుమార్తె సౌమ్య అనారోగ్య సమస్యను రెండు నెలల క్రితం సిఎం పజావాణి దృష్టికి తీసుకువచ్చారు. తల్లి అనురాధ స్వయం సహాయక గ్రూపు సభ్యురాలు కాగా తండ్రి ఈర్ల శ్రీనివాస్ సన్నకారు రైతు. సౌమ్య దీనస్థితి గమనించి సిఎం ప్రజావాణి అండగా నిలిచింది.