ఆటో డ్రైవర్ హత్య కేసును టోలీచౌకి పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేశారు. ఎడిసిపి టోలీచౌకి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. టోలీచౌకి, హకీం పేటకు చెందిన మహ్మద్ ముజామిల్ అలియాస్ ఆయుబ్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 30 తేదీన ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో ఆటోలో హత్యకు గురయ్యాడు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చాంద్రాయణగుట్ట, వాహిద్ ముస్తాఫా కాలనీకి చెందిన మహ్మద్ ఇషాక్ అలియాస్ ఖలీద్ ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు.
ఇషాక్, ముజామిల్, మరికొంత మంది స్నేహితులు కలిసి ఆటోలో రాత్రి 2 గంటల వరకు మద్యం తాగారు. మద్యం తాగే సమయంలో ఇద్దరి మధ్య మొబైల్ ఫోన్ కోసం గొడవ జరగడంతో ఖలీద్ తాడును ముజామిల్ మెడకు బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు హకీం పేటలోని ఓయో రూంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సైలు సతీష్ కుమార్, రాఘవేందర్ తదితరులు నిందితుడిని పట్టుకున్నారు.