హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుఫాన్ మీద ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల 12 మంది చనిపోయారని, ఇంకా చాలా మంది గల్లంతు అయ్యారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అసమర్థతతో పాటు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ విధ్వంసం ఎక్కువైందని మండిపడ్డారు. తుఫాన్ ప్రభావంతో 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసిందని అది ముమ్మాటికీ తప్పే అని ధ్వజమెత్తారు.
పంటను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకెళ్లారని, అకాల వర్షాలకు పంట తడిచి రైతులు నష్టపోవడంతో వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను కొనడానికి ప్రభుత్వం కొర్రీలు పెట్టిందని, దీంతో పంటను అమ్మడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. తేమశాతాన్ని, డ్యామేజ్ ను పరిగణనలోకి తీసుకోకుండా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.