దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పట్టిపీడిస్తున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ బిజెపి ప్రభుత్వం చేపట్టిన మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం(29.10.25) ఉదయం ఐఐటి కాన్పూర్ సహకారంతో ఢిల్లీలోని బురారి, ఉత్తర కరోల్‌బాగ్, మయూర్ విహార్, బద్లి తదితరప్రాంతాల్లో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించారు. కాన్పూర్ ఐఐటి నుంచి ప్రయోగ విమానం బయలుదేరి 6000 అడుగుల ఎత్తులో రసాయనాలు వెదజల్లినా ఫలితం దక్కలేదు. ఈ ప్రక్రియ పూర్తయి నాలుగు గంటలైనా వర్షాలు కురవలేదు. గత ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం 2023లో ఢిల్లీలో పొగమంచు సీజన్‌లో మేఘమథనం చేపట్టాలని ప్రయత్నించినా వాతావరణం అనుకూలించక విరమించుకుంది. 2024 లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఢిల్లీ వాయునాణ్యతను అత్యవసరంగా మెరుగుపర్చడానికి మేఘమథనం ఆచరణ సాధ్యం కాదని పార్లమెంట్‌కు వెల్లడించడం ఈ సందర్భంగా గమనార్హం.
లాహోర్, బ్యాంకాక్, కౌలాలంపూర్, బీజింగ్ తదితర ప్రపంచం లోని అనేక నగరాల్లో మేఘమథనం ప్రయోగాలు నిర్వహించినా అనుకున్న లక్షాలు సాధించలేక దీన్ని విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఎంతో వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టడం వ్యర్థ ప్రయత్నమే తప్ప ఏమాత్రం ఉపయోగం జరగలేదు. ఆకాశంలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉన్నప్పుడే మేఘమథనం పనిచేస్తుంది తప్ప స్వయం సహజ సిద్ధంగా వర్షాన్ని అందించదు. అందువల్ల పొడిగాలులు లేని శీతాకాలంలో కాకుండా వర్షాకాలం లోనే దీన్ని వినియోగిస్తారు. 2023 లో లాహోర్‌లో మేఘమథనం వల్ల కొద్దిసేపు కురిసిన వర్షం గాలి నాణ్యతను మెరుగుపర్చినా, కొన్ని గంటలకే పరిమితమైంది. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మామూలే అయింది.ఈ కారణంగా ప్రపంచం లోని చాలా దేశాలు మేఘమథనాన్ని నమ్ముకోవడం లేదు. అత్యవసరంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించవలసి వచ్చినా దీని గురించి ఆలోచించడం లేదు. ప్రభుత్వాలకు ఈ వాస్తవాలు తెలిసినవే.
బిజెపి ప్రభుత్వానికి కూడా ఈ సంగతి తెలిసినా ఎందుకు మేఘమథనం చేపట్టిందో అర్థంకావడం లేదు. శీతాకాలంలో మేఘాలు చాలావరకు పశ్చిమ వైపు అలజడులనుంచి ఉత్తరాదికి వ్యాపిస్తుంటాయి. అవి స్వల్పకాలమే ఉన్నా అప్పటికే సహజంగా వర్షాలను తీసుకొస్తాయి. అందువల్ల మేఘమథనం అవసరం ఉండదు. ఎయిర్‌క్రాఫ్ట్ పరిమితుల బట్టి 5 6 కి.మీ మించి ఎక్కువ ఎత్తులో ఉన్న మేఘాలు మేఘమథనానికి వీలుపడవు. మేఘమథనం సరిగ్గా, సమర్థవంతంగా జరగాలంటే ఆకాశం దట్టమైన మేఘాలతో, అనుకూల వాతావరణంతో ఉండాలి. ఢిల్లీలో శీతాకాలం నాడు అలాంటి వాతావరణం కనిపించదు. వర్షం జల్లులు కురియడానికి సిద్ధంగా ఉన్నా అవి నేలపై రాలడానికి ముందే మేఘాల కింద ఉన్న పొడిగాలి వాటిని ఆవిరిగా దహించేస్తుంది. మరో ముఖ్యమైన విషయం మేఘమథనానికి ఉపయోగించే రసాయనాల సామర్థం విషయంలో ఆందోళన నెలకొంటోంది. ఊహించని పర్యవసానాలు ఎదురవుతున్నాయి. సూక్ష్మం గా చెప్పాలంటే అవి ఏమాత్రం పనిచేయవు. ఈ విధంగా నిరాశపరిచే ఈ ప్రయోగం కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? దీనికి సమాధానం ఢిల్లీ ప్రభుత్వ బిజెపి వర్గాల్లోనే ఉంది.
గత ఆప్ ప్రభుత్వం 2023లో చేయలేకపోయిందని, ఇప్పుడు తాము చేసి చూపిస్తామని బిజెపి ప్రభుత్వం పంతం పెట్టుకుంది. ఇది సైన్స్ గురించి తగిన పరిజ్ఞానం లేక, రాజకీయంగా సాధించాలన్న ఆలోచన తప్ప మరేం కాదని తెలుస్తోంది. ఐఐటి కాన్పూర్ ఇందులోకి తనకు తాను ప్రవేశించి అన్నివర్గాలను ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. భారత్ మొట్టమొదట 1950 లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెయిటొరాలజీ నేతృత్వంలో పశ్చిమ కనుమల్లో మేఘమథనం జరిగింది. థాయ్‌లాండ్‌లో కృత్రిమ వర్షపాతం సృష్టించేందుకు డిపార్టుమెంట్ ఆఫ్ రాయల్ రెయిన్ మేకింగ్, అండ్ అగ్రికల్చరల్ ఏవియేషన్ అనే ప్రత్యేక విభాగమే ఉంది. ప్రపంచం లో చైనా, అమెరికా దేశాలు భారీ ఎత్తున వాతావరణ మార్పు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో దుర్భిక్ష నివారణకోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కానీ వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించే మార్గాల్లో మేఘమథనం కూడా ఒకటిగా అనుసరిస్తున్నారు. ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని, అలాగే యమునా నదీ జల కాలుష్యాన్ని శ్రీఘ్రగతిలో పరిష్కరిస్తామని బిజెపి గత కొన్నేళ్లుగా వాగ్దానాలు చేస్తోంది. యమునా నదీ కాలుష్యంపై ఆప్ ప్రభుత్వ కాలంలో ఎన్నో వివాదాలు, సవాళ్లు చెలరేగిన సంగతి తెలిసిందే.
పర్యావరణ సమస్యల పరిష్కారానికి దగ్గరి మార్గాలంటూ ఏవీ లేవు. ప్రపంచంలో ఎక్కడైనా, క్రమబద్ధమైన, శాస్త్రీయ, వైజ్ఞానిక, సాంకేతిక, పద్ధతులు, పాలకవర్గాల జవాబుదారీతనం, దీర్ఘకాలిక ప్రణాళికల అమలు వంటి చర్యలతోనే పర్యావరణ పురోగతి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ విస్మరించి కేవలం రాజకీయ ప్రాబల్యంతో వాస్తవాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలతో ఏదీ సాధ్యం కాదు. ఈ పాఠాన్ని ఢిల్లీ బిజెపి ప్రభుత్వం వంట పట్టించుకోవడం తప్పనిసరి. ప్రయోగాలు, ఆవిష్కరణలకు వాటి స్థానం వాటికి ఉంటుంది తప్ప ఆవిష్కరణలు, రాజకీయ సిద్ధాంత భావజాలాన్ని భర్తీ చేయలేవు. మనం పటిష్టమైన మౌలిక సదుపాయాలను, వ్యవస్థలను ముందుచూపుతో నిర్మించుకోలేకుంటే ఆకాశం, ప్రకృతి వనరులు, నదులు, పర్వతాలు ఇవన్నీ కలుషితమవుతూనే ఉంటూ మనం మాత్రం పురోగతి అనే భ్రమలో చిక్కుకుపోతుంటాం.