మహరాష్ట్ర, తెలంగాణ అనాదిగా సాంస్కృతిక కేంద్రాలుగా గుర్తింపు పొందాయని, ఈ రెండింటి మధ్య బలమైన సాంస్కృతిక అనుబంధం ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షెలార్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును డా.బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు సంస్కృతిలోని వైవిధ్యాన్ని పరస్పరంగా పంచుకునే దిశగా రెండు రాష్ట్రాలు కలసి ముందుకు సాగాలని ఇరువురు అకాంక్షించారు. ‘మరాఠా మిలటరీ ల్యాండ్ స్కేప్స్ ఆఫ్ ఇండియా’ కాఫీ టేబుల్ బుక్ ను ఈ సందర్భంగా మంత్రి జూపల్లికి అందజేశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సహకారం – మార్పిడి, పర్యాటక అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. సాంస్కృతిక పునరుజ్జీవనం, సాంస్కృతిక సలహా మండలి ద్వారా సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యం, బతుకమ్మ వేడుకల్లో గిన్నిస్ వరల్ రికార్డు, నూతన పర్యాటక విధానం, తదితర అంశాలను మంత్రి జూపల్లి వివరించారు. యాసలు, కళారూపాలను, వేడుకలను ప్రస్తావిస్తూ, వైవిధ్యాన్ని తన ప్రత్యేకతగా చూపే రాష్ట్రం తెలంగాణ అన్నారు.