మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ సీనియ ర్ నేత, భారత జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. శుక్రవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్ర సాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్కలు పాల్గొన్నారు. అదేవిధంగా మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సిఎస్ రామకృష్ణ రావు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డిజిపి శివధర్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమా ణ స్వీకారం చేసిన అనంతరం మహమ్మద్ అజహరుద్దీన్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులంతా శుభాకాంక్షలు తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12.25కు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం కేవలం 9 నిమిషాల్లోనే ముగిసింది. ప్రస్తుతం మంత్రివర్గం సంఖ్య 16కు చేరింది. మరో ఇద్దరికి అవకాశం ఉంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్లస్
అజహరుద్దీన్‌కు ఇవ్వబోయే శాఖపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు హోంశాఖ లేదా మైనార్టీ, క్రీడాశాఖలను కేటాయించే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి రెండ్రోజుల్లో క్లారిటీ రానున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ కేబినెట్‌ల్లో ముస్లింలు లేరు. ఇదే విషయమై కొంతకాలంగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో కూడా అదే అంశాన్ని విపక్షాలు ప్రధాన అస్త్రంగా మలుచుకున్నాయి. దీంతో అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం వల్ల మైనార్టీలను సంతృప్తి పరచడంతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కూడా ప్లస్ అవుతుందని అధిష్టానం భావించింది.
నాకు ఎవరి సర్టిఫికెట్
అవసరం లేదు: అజహరుద్దీన్
ఈ సందర్భంగా మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలు, కుటుంబ సభ్యుల ఎదుట మంత్రిగా ప్రమాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హై కమాండ్‌కు, సిఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరికీ తానేంటో తెలుసని తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నా దేశ భక్తి గురించి కొందరు ఆరోపణలు చేస్తున్నారని, కిషన్‌రెడ్డికి తన గురించి పూర్తి అవగాహన లేదని, తనపై కేసులున్నాయంటున్నా అవి ఎక్కడా నిరూపితం కాలేదని ఆయన తెలిపారు. ఎవరో చేసిన వ్యాఖ్యాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి అజహరుద్దీన్ నిరాకరించారు. ఏ శాఖ ఇచ్చినా నిబద్ధతతో పని చేస్తానని తనకు ఏ శాఖ ఇవ్వాలో సిఎం నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు.
గవర్నర్ వద్ద పెండింగ్ ఉంటే
వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న
గవర్నర్ కోటా కింద శాసనమండలి సభ్యుడిగా అవకాశం కల్పిస్తే బాగుంటుందని గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అజహరుద్దీన్‌తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు (టిజెఎస్) కోదండరాంలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని నిర్ణయించి గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. గవర్నర్ దగ్గర ప్రస్తుతం ఈ అంశం పెండింగ్‌లో ఉంది. ఈ కోటా కింద ఏదైనా సాంకేతికపరమైన ఇబ్బంది తలెత్తితే వచ్చే ఏడాదిలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీల నుంచి ఎమ్మెల్సీగా అజహరుద్దీన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
1984లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి
అజహరుద్దీన్ రంగప్రవేశం
అజహరుద్దీన్ అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. నిజాం కళాశాలలో బికాం చదివారు. తన మేనమామ జైనులాబుద్దీన్ స్ఫూర్తితో క్రికెట్ రంగం వైపు అడుగులు వేశారు. 1984లో అజహరుద్దీన్ అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేశారు. క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు. 1989లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అజహరుద్దీన్ బాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. ఈయన హెచ్‌సిఏ అధ్యక్షుడిగా పనిచేశారు. రిటైర్‌మెంట్ అనంతరం ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
2009లో ఎంపిగా గెలిచిన
అజహరుద్దీన్
62 ఏళ్ల అజహరుద్దీన్ భారత జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌ను ముగించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన 2009లో కాంగ్రెస్‌లో చేరారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓడిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా అదృష్టం వరించలేదు. రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్‌గా ఉన్న సమయంలో ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ పనిచేశారు.