హర్యానాలోని రొహతక్‌లో ఉన్న మహార్షి దయానంద యూనివర్శిటీ (ఎండియు) అధికారులు మహిళా పారిశుద్ధ కార్మికులు ఇద్దరి పట్ల రాక్షసంగా, జుగుప్సాకరంగా వ్యవహరించారు. పారిశుద్ధం పనుల్లో వేగంగా పనిచేయని వారిని నిలిపివేసి అవమానించారు. తమకు నెలసరి రోజులు అని , కడుపు నొప్పితో పనిచేయలేకపోతున్నామని చెప్పగా , ఈ అధికారులు వితండవాదానికి దిగారు. మీకు అదే ..అని నమ్మడానికి ఏదైనా ఆధారం ఉందా? బాత్‌రూంకు వెళ్లి మీ లోపలి భాగాలు, శాపిటరీ ప్యాడ్స్ ఫోటోలు తీసుకుని రండి, చూసి నిజమైతే పనిలో ఉంచుతాం లేకపోతే ఏకంగా ఉద్యోగం నుంచి ఊడబెరుకుతామని బెదిరించారు. దీనితో వారు చేసేది లేక ఆ పని చేశారు. తరువాత విషయం ఇతర సిబ్బందికి తెలియడం, పెద్ద ఎత్తున విద్యాసంస్థలో పలువురు గుమికూడి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీనితో అధికారులు రంగంలోకి దిగి ఇద్దరు శానిటరీ సూపర్‌వైజర్లు వితేందర్, వినోద్ హుండాను , అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యామ్ సుందర్‌ను సస్పెండ్ చేశారు. తరువాత స్థానిక పోలీసు స్టేషన్‌లో వారిపై కేసులు నమోదు చేశారు. నాలుగైదు రోజుల క్రితమే దారుణ ఘటన జరిగింది. అయితే ఉన్న ఉపాధి పోతుందనే భయంతో బాధితులు తమ ఇబ్బందిని తెలియచేసుకోలేదు.