ముందూ వెనుకా చూడకుండా సంపాదనే లక్ష్యంగా జీవితంలో చాలా భాగం గడిపిన తర్వాత చాలా మంది ధనవంతులకు జీవన విశ్రాంత సమయంలో కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. వందల కోట్ల ఆస్తి ఉన్నా ఎక్కడా తన గురించి ప్రస్తావనే రావడం లేదేమీ అనే బెంగ మొదలవుతుంది. ఎలాగైనా తమ పేరు గొప్పగా మారుమోగిపోవాలనే దుగ్ద వారిని నిలువనీయదు. ఎంత ఖర్చు అయినా పర్వా లేదు, తన పేరు నలుగురిలో నానాలి. యూ ఆర్ గ్రేట్ అని పొగడాలి. అందరిలో మంచి పేరు రావాలంటే సామాజిక సేవనే తగిన తోవ. ఆస్తిపరుడనే పేరు ఎలాగూ ఉంది, దానితోపాటు మంచివాడు, దయామయుడు, కరుణా హృదయుడు అనే ప్రచారం కావాలి. పుట్టినరోజు లాంటి పండుగల రోజున పేదలకు అన్న, వస్త్రదానాలు చేయాలి. అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచాలి. పత్రికల వారిని సాదరంగా ఆహ్వానించి ఆ వార్తలకు ప్రాధాన్యత తెచ్చుకోవాలి. సాహిత్యం, సంగీతం లాంటి లలిత కళలపై ఇష్టం, అభిమానం ఉన్నాయని చెబితే సాంస్కృతిక సంఘాలు వదిలిపెట్టవు. వారి కార్యక్రమాలకు స్పాన్సర్‌గా ఉంటే వ్యక్తిగత గౌరవంతో పాటు కోరినంత ప్రచారం లభిస్తుంది. అడగక ముందే కళాబంధు, డాక్టరేట్ అనే గౌరవాలు పేరు ముందు జత కడతాయి.
టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో గొప్పలు చెప్పుకోవడానికి కాలు కదిలించి సభలు, సమావేశాలకు వెళ్లే అవసరమే లేదు. ఇంటికే ఓ యూట్యూబర్‌ను రప్పించుకొని గంట వీడియో చేస్తే చాలు, చూసేవారి గుండెల్లో కొంతైనా చోటు లభిస్తుంది. మరో యూట్యూబర్‌తో మరో ముచ్చట. పాలు అమ్మి, పూలు అమ్మి.. కష్టపడి ఇంతవాడినైనానని అలా పెయిడ్ వీడియోలలో ఎన్ని కబుర్లైనా చెప్పుకోవచ్చు. ధనం కన్నా గుణమే గొప్పదని, డబ్బుతో అన్నింటిని కొనలేమని కొత్తగా తెలుసుకున్నట్లు ప్రజలకు ఉపదేశం చేయొచ్చు. ప్రయివేటు ప్రాక్టీస్ ద్వారా కోట్లు గడించిన డాక్టర్లు ఆరోగ్య సూత్రాల పేరిట తమ జీవితంలోని విశేషాలను ఏకరువు పెడతారు. ప్రైవేటు విద్యా వ్యాపారం చేసి తరతరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టినవారు తాము దేశానికి ఎందరో ఇంజనీర్లను అందించామని గర్వంగా చెప్పుకుంటారు. ఫార్మా రంగంలో ఉంటే మందుల తయారీ ద్వారా కోట్లాది మందికి ప్రాణభిక్ష పెట్టామని చెప్తారు. కానీ వ్యర్థ రసాయనాలు నాలాల్లోకి వదిలి సర్వం విషతుల్యం చేస్తున్న విషయం దాచి పెడతారు. కనీస వేతన చట్టాన్ని కాలరాసిన పారిశ్రామికవేత్తలు కార్మికులను కన్నబిడ్డల్లా చేసుకున్నానని మన చెవుల్లో పువ్వులు పెట్టవచ్చు.
ప్రజల రక్తమాంసాలను పీల్చడానికి ప్రైవేటు విద్య, వైద్యం అనేవి పదునైన కోరలున్న వ్యాపార జాగిలాలు. వాటిలో కోట్లు కొల్లగొడుతూ ప్రజలకు గొప్ప మేలు చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు చేతి వైద్యం చేసేవారు తప్ప మెడిసిన్ చదివిన వారందరు ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసేవారు. జనాభా పెరిగి సర్కారు దవాఖానాలు సరిపోక ప్రైవేటు హాస్పిటళ్లు మొదలయ్యాయి. అలా సేవ పేరుతో వైద్య వృత్తి నిలువు దోపిడీకి సెంటర్ అయింది. కాలక్రమంగా మెడిసిన్ చదవడమే సొంత ప్రాక్టీస్ కోసం అన్నట్లు మారిపోయింది. వీలయినంత త్వరగా ఓ భారీ భవంతి కట్టేసి కార్పొరేట్ స్థాయికి మారిపోవాలనేదే నేటి డాక్టర్ల కల. వృత్తిలో పైకెదగడం మంచిదే కానీ, ఎదగడమే లక్ష్యంగా జనాన్ని మోసం చేయకూడదు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టకూడదు. వృత్తి నైతికతకు భంగం రానీయవద్దు. వీటిని పాటిస్తే గుట్టలుగా ధనం పేరుకుపోయి అవకాశమే లేదు. చాలా చోట్ల యాభై, వంద రూపాయల ఫీజుతో నలభై, యాభై ఏళ్లుగా ప్రాక్టీస్‌చేస్తున్న డాక్టర్లు ఉన్నారు. వారికి వృత్తి ధర్మం తప్ప ప్రచారం అక్కరలేదు. అదీ నిజమైన జీవన సాఫల్యం. అయితే వీరివైపు ప్రభుత్వాలు కన్నెత్తి చూడవు. నగరాల్లోని ఖరీదైన ప్రాంతాల్లో తమ కార్పొరేట్ వైద్యశాలలు విస్తరిస్తున్న డాక్టర్ల మెడలో పద్మ పతకాలు అలరిస్తుంటాయి. ప్రభుత్వాలు, పత్రికలు, సంస్థలు అన్ని ఈ ఢాంబిక జీవితానికే గుర్తింపునిస్తున్నాయి.
అడ్డంగా సంపాదించాక మీడియా ముందుకొచ్చి తాము పనివాళ్లను సర్వెంట్స్ అని కాకుండా హెల్పర్స్ అని గౌరవంగా పిలుస్తామని అంటారు. పక్కన కూచున్న వారి పిల్లలు తమకు డాడీ పేదలను ప్రేమించడం నేర్పారని సుద్దులు చెబుతారు. డ్రైవర్ కూతురు పెళ్ళికి వెళ్ళినామనే మాటను ఎన్నో మెట్లు దిగామన్నట్లు ఘనంగా చెబుతారు. పనివాళ్ల పిల్లల చదువుల బాధ్యత తమదే అంటారు. ఇవన్నీ చెబుతారు కాని తులతూగే ధనరాశులు ఎలా కూడబెట్టారో చెప్పరు. పన్ను ఎగ్గొట్టడానికి ఎన్ని దొంగ దారులు వెదికారో బయటపెట్టరు. ఉద్యోగుల జీతభత్యాల పెంపు విషయంలో వీరెంత కఠినంగా ఉంటారో ఆ పని వాళ్లకే తెలుసు. నెలకు లక్ష తీసుకుంటున్నట్లు సంతకం పెట్టి అందులో సగమైనా చేతికందని శ్రమజీవులు వీరి హాస్పిటల్, కాలేజీల్లో ఎందరో ఉంటారు. ఒక పత్రికాధిపతి, ఒక మహానటుడు తమ పనివారలకు అయిదు రూపాయలు పెంచడానికి కూడా గింజుకొనేవారట. వారి కీర్తిప్రతిష్ఠల ధగధగల ముందు ఇవి కానరావు. నిజాయితీగా సంపాదించి, అందులోంచి ఎంత మేరకు దానం చేస్తున్నావన్నది మాత్రమే దాతృత్వానికి కొలబద్దగా నిలుస్తుంది. చార్మినార్ దగ్గర ఓ చిరు వ్యాపారి రోజూ యాభై మందికి రొట్టెలు పంచిపెడతారట. నల్గొండలో ఓ రిటైర్డ్ టీచర్ తన సొమ్మునంతా ఓ లైబ్రరీ కోసం వెచ్చించారట. ఓ వృద్ధురాలు కోట్లు విలువ చేసే తమ ఇంటిని ప్రభుత్వానికి రాసిచ్చారట. ఇలాంటి త్యాగాలు ఎక్కడో లోపలి పేజీల్లో చిన్న వార్తగా వస్తాయి. వీరిది కేవలం దాతృత్వం కాదు, మహా మానవత్వం. నలుగురికి సాయపడడంలో వీరిది ఫ్యాషన్ కాదు పాషన్, జీవన కాంక్ష.
బద్రి నర్సన్, 94401 28169