గుజరాత్ : ప్రత్యేక నాణెం, స్టాంపు విడుదల చేశామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ఐక్యత కోసం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. నర్మదా నది ఒడ్డున దివంగత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి లో మోడీ పాల్గొన్నారు. ఐక్యత విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏక్తానగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల మాదిరిగానే ఏక్తా దివస్ జరుపుకుంటున్నామని, భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. విభజన శక్తులకు ప్రజలు దూరంగా ఉండాలని, కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని విమర్శించారు. దేశ సమగ్రతకు నక్సలిజం ముప్పుగా పరిణమించిందని, నక్సల్ ఏరివేత లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు చేశామని అన్నారు. నక్సలిజం మూలాలను సమూలంగా పెకలిస్తామని హెచ్చరించారు. పటేల్ అభిప్రాయాలను దివంగత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గౌరవించలేదని, పటేల్, డా. దాదాసాహెబ్ అంబేడ్కర్ ను కాంగ్రెస్ అవమానించందని ఆవేదన వ్యక్తం చేశారు.
పటేల్ దూరదృష్టిని కాంగ్రెస్ మరచిపోయిందని, కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల కశ్మీర్ లో కొంత భాగాన్ని పాకిస్థాన్ ఆక్రమించిందని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ బలాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, దేశ ఐక్యతను బలోపేతం చేసే చర్యలను ప్రోత్సహిస్తామని మోడీ పేర్కొన్నారు. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటుంటే కొందరికి బాధగా ఉందని, దేశం నుంచి చొరబాటుదారులను తరిమి కొట్టాలని ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. కశ్మీర్ మొత్తాన్ని భారత్ లో కలపాలని పటేల్ ఆకాక్షించారని, కశ్మీర్ కు ప్రత్యేక రాజ్యాంగం, జెండాను ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ బలహీన విధానాల వల్ల కశ్మీర్ కొంత ఆక్రమణకు గురైందని, పాక్ ఆక్రమణ వల్ల కశ్మీర్, దేశంలో అశాంతి నెలకొందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచిపోషించిందని, ఇంత జరిగినా ఉగ్రవాదుల ముందు కాంగ్రెస్ తలవంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పటేల్ ఆకాంక్షలను కాంగ్రెస్ గౌరవించలేదని, తాము గౌరవించామని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.