మన తెలంగాణ /వరంగల్ బ్యూరో/ఖమ్మం బ్యూరో: వరంగల్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో బుధవారం నుండి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన కుంభవృష్టి కి చెరువులు తెగి వరంగల్ మహా నగరాన్ని వరదలు ముంచెత్తి జలదిబ్బంధo చేశాయి. ఈ హఠాత్తు పరిణామంతో ప్రజలు దిక్కుతోచక ప్రా ణాలు కాపాడుకోవడానికి బిల్డింగుల పైకి బతుకు జీవుడా అంటూ పిల్లాపాపలతో బిల్డింగ్ టెర్రస్‌ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. తమను కాపాడేవారు లేరా అంటూ గురువారం తెల్లవారు జాము నుండి ప్రజలు ఆర్తనాదాలు పెట్టినా వరదల నుండి గురువారం రాత్రి వరకు వారిని బయటికి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కన్నీరే మిగిల్చింది.భారీగా పంటన ష్టం జరిగింది. మున్నేరు పొంగింది. గురువారం సాయంత్రానికి 25అడుగులకు చేరుకోవడంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోపాల్పూర్ ఊర చెరువు తెల్లవారుజామున తెగిపోవడంతో ఆ వర ద హనుమకొండ జిల్లా కేంద్రంలోని అమరావతి నగర్, సమ్మయనగర్ కాలనీ, గోపాలపురం, టిఎన్జీవోస్ కాలనీ, విద్యారణ్యపురి, నహీంనగర్, రెడ్డి కాలనీ, డబ్బాల నుండి
వరద ప్ర భావం నాగారం చెరువుకు చేరుకుంది. అయితే ఈ కాలన్నింటిని తెల్లవారుజామునే వరదలు ముంచెత్తడంతో ఆ ఇండ్లలోకి నీరు చేరడం వల్ల సర్వం కోల్పోయిన ఇంటి యజమానులు పిల్లా పాపలతో పక్కనున్న బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల కట్టు బట్టలతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తారు. గురువారం ఉదయం అధికారులు అందుబాటులోకి రావడంతో వారికి వాటర్ బాటిల్స్ టిఫిన్స్, ఆహారం డ్రోన్ల ద్వారా సరఫరా చేశారు. మంత్రి సురేఖ, ఎంపీ కడియం కావ్య ఎంఎల్‌ఎ రాజేందర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్లు సత్యశారదలు క్షేత్రస్థాయిలో గురువారం ఉదయం నుండి ముంపు ప్రాంత ప్రజలను వరదల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వరదలు నుండి వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. భారీ ఎత్తున వరదలు ముంచేతడం వల్ల ఉధృత స్థాయిలో ప్రధాన రహదారులపైనే నడుముల వరకు నీళ్లు ప్రవహించాయి. ఈ పరిస్థితిలో వరంగల్ చుట్టూ వరదలు చుట్టుముట్టి నగరాన్ని దిగ్బంధం చేశాయి. ఎటునుండి ఎటు వెళ్లాలన్నా కూడా నగరంలోకి వెళ్లలేని పరిస్థితి ఉంది.
వరద ముంచెత్తిన విధానం….
బుధవారం ఉదయం నుండి తుఫాన్ ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండగా వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతూ చెరువులు, కుంటలు నిండాయి ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో ఉన్న ధర్మసాగర్ చెరువుకు వరద ఉధృతి ఎక్కువ కావడంతో ఆ చెరువు కట్ట నీటి ప్రవాహనికి తట్టుకోలేక తెగిపోయింది. ఆ చెరువు నీరు అంతా సోమిడి చెరువులో కలిసి ఆ చెరువు మత్తడి ద్వారా ఉధృతంగా ప్రవహించింది. దీంతో గోపాలపూర్ ఊర చెరువు లోకి అధికంగా నీరు రావడంతో చెరువు కట్ట పూర్తిగా ధ్వంసమైంది. ఈ పరిణామంతో మూడు చెరువుల వరద నీరు హన్మకొండ జిల్లా కేంద్రాన్ని గురువారం తెల్లవారు జామున ముంచింది. హనుమకొండలోని అమరావతినగర్ సమ్మయ్యనగర్, విద్యారణ్యపురి టీవీ టవర్ కాలనీ, గోపాలపురం,టీఎన్జీవోస్ కాలనీ, పలు కాలనీలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లలోకి వరద ముంచెత్తడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటు చూసినా వరద ఉధృతి ప్రవహించడంతో ఏమి తోచని పరిస్థితుల్లో ఆయా కాలనీలో ఉన్న ప్రజలందరూ వారి వారి భవనాల పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు.
వరంగల్ తూర్పులో ముంపు…
బుధవారం నుండి గురువారం తెల్లవారుజామున వరకు లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరదలు నగరాన్ని వరదలు చుట్టుముట్టాయి ఈ నేపథ్యంలో వెళ్లాలన్న ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం ఉదయం వరకు టెర్రస్‌పైలో ఉన్న ప్రజలకు ఆహారం అందించిన అధికారులు ప్రజాప్రతినిధులు వారిని బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఉన్నాయి హంటర్ రోడ్ లోనే సిఐ ఎస్సార్ గార్డెన్ పరిధిలో భారీ ఎత్తున వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. ఎటు చూసినా నీటితో నిండి ఉన్న ప్రాంతాలు కనిపించాయి. భద్రకాళి చెరువు శిఖం హంటర్ రోడ్డుపై భాగంలో వరదలు భారీగా ప్రవహించడం వల్ల ప్రజలు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కూడా మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధికారులు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ గురువారం రాత్రి వరకు వరదలు తగ్గకపోవడంతో ప్రజలు భవనాలపైనే ఉండిపోయారు.
వరంగల్‌హన్మకొండకు తెగిన సంబంధాలు
వరంగల్ నుండి హన్మకొండకు వెళ్లే ప్రధాన రహదారులు వరదలతో నిండిపోయాయి. వరంగల్ నుండి వస్తున్న భద్రకాళి వాగు వరద ములుగు రోడ్డు జంక్షన్లో నిలిచిపోయాయి .అలంకార్ కాపు వాడ ములుగు రోడ్డు వరకు భారీ ఎత్తున నీరు చేరడం వల్ల బస్సులు సైతం వెళ్ళలేని పరిస్థితిలో ఉండడంతో పోలీసులు గురువారం రాత్రి వరకు అటు రాకపోకలను అనుమతించలేదు. అదేవిధంగా హనుమకొండ నుండి వరంగల్ చేరుకోవడానికి హంటర్ రోడ్‌లోని సిఎస్‌ఆర్ గార్డెన్ ఖమ్మం బైపాస్ బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున వరద పెరిగి నీరు ప్రవహిస్తుండడంతో అటు కూడా వాహనాలను అనుమతించలేదు. వరంగల్ అండర్ బ్రిడ్జి మునిగిపోవడం వల్ల ఖమ్మం వరంగల్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ నర్సంపేట నుండి వరంగల్ హనుమకొండ కు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితిలు ఉన్నాయి. కరీంనగర్ నుండి రావాల్సిన బస్సులు పరకాల నుండి డైవర్ట్ చేశారు.
ములుగు రోడ్డు నుండి రావాల్సిన వాహనాలను పోచం మైదానం నుండి ములుగు రోడ్డు ఆరేపల్లి కు తరలించి అక్కడ నుండి పరకాలకు తరలించారు పెద్దమ్మ గడ్డ కు వెళ్లే హంటర్ రోడ్డు బ్రిడ్జి పై నుండి భద్రకాళి చెరువు వాగుల వరద భారీగా వస్తున్నందున వాహనాలను పరిమిత సంఖ్యలో అనుమతించారు. వరంగల్ నుండి హనుమకొండకు వెళ్లాలన్న వయా రంగశాయిపేట నుండి బట్టుపల్లి కాజీపేట మీదగా వెళ్లాల్సి ఉంది పరకాల ములుగుకు వెళ్లాల్సిన వాహనాలు భీమారం నుండి జాతీయ రహదారిపై ములుగు రోడ్డు ఎన్‌ఎస్‌అర్ వద్దకు చేరుకుంటున్నాయి. గురువారం రాత్రి వరకు ఇదే పరిస్థితి ఉండడంతో నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకు పోయింది.
ట్రాక్టర్ల పై పరిశీలన…
హనుమకొండ వరంగల్ పట్టణాల్లో ముంచేతిన వరదలను పరిశీలించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ సత్య శారదలో ట్రాక్టర్లపై వరదల్లో ప్రయాణించి వరద ఉధృతిని అంచనా వేశారు. వరద తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలను టెర్రస్‌పై నుండి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు సహా. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలను రంగంలోకి దించి వారి సాయంతో కొన్ని ప్రాంతాల్లోనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.