రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. తాజాగా శుక్రవారం మరోసాంగ్ ను మేకర్స్ వదిలారు. ‘చిన్ని గుండెలో’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. రామ్, భాగ్యశ్రీ మధ్య.. కలర్ ఫుల్ సెట్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. జానీ మాస్టర్ తనదైన స్టైల్ లో కొరియోగ్రఫీ అందించాడు. సాంగ్ తోపాటు చిన్న చిన్న డ్యాన్స్ మూవ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరోగా కనిపించనున్నారు. ఆయన వీరాభిమానిగా రామ్ నటిస్తున్నారు. వివేక్ అండ్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, నవంబరు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.